భగినికి విడుదల కష్టాలు

EC seeks report from WB poll officer on alleged biopic of Mamata benergee - Sakshi

ఎన్నికల వేళ వివాదంలో ‘భగిని–బెంగాల్‌ టైగ్రస్‌’

ఇది ఎన్నికల సీజనే కాదు. పొలిటికల్‌ బయోపిక్‌ సీజన్‌ కూడా. ఎన్ని అవాంతరాలెదురైనా, ఏ సినిమా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా రాజకీయ నేతలు జీవిత చరిత్రలు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీవితం స్ఫూర్తితో ‘భగిని–బెంగాల్‌ టైగ్రస్‌’ పేరుతో ఒక సినిమా తీశారు. ఈ సినిమాను మే 3న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ట్రైలర్‌ ఇలా బయటకు వచ్చిందో లేదో బీజేపీ, వామపక్షాలు ఈ మూవీపై భగ్గుమంటున్నాయి. వెంటనే ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను ఆపినప్పుడు ఈ సినిమా విడుదలకు ఎలా అంగీకరిస్తారంటూ బీజేపీ వాదిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిణి ఇందిరా బందోపాధ్యాయ రూపురేఖలు, నడక నడత అచ్చంగా మమతనే తలపించేలా ఉన్నాయి. తెల్లచీర కట్టుకొని, జుట్టు ముడి వేసుకున్న ఆ పాత్ర మమతది కాదంటే ఎవరూ నమ్మేలా లేదు. అంతేకాదు ట్రైయలర్‌లో ఆమెను దీదీ అని సంబోధించడం కూడా కనిపించింది. ఈ పాత్రని అనన్య గుహ, అలోక్‌నంద గుహ, రుమా చక్రవర్తి ఆయా వయసులకి అనుగుణంగా పోషించారు.

బయోపిక్‌ కాదు: దర్శకుడు
సినిమా డైరెక్టర్‌ నేహల్‌ దత్తా ఇది మమతా బెనర్జీ  బయోపిక్‌ కాదని వాదిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించామని చెబుతున్నారు. ‘మోదీ సినిమా మాదిరి ఇది బయోపిక్‌ కాదు. అయితే మమత నుంచి స్ఫూర్తిని పొంది సినిమా తీశాం. ఆమెలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళ ఎక్కడా కనిపించరు. మహిళా సాధికారతను ఉద్విగ్నభరితంగా తెరకెక్కించాం’ అని చెప్పారు. ‘జీవితంలో తనకెదురైన సమస్యల్ని, అవరోధాలను ఒక మహిళ ఎంత దృఢంగా ఎదుర్కొందో చెప్పడమే మా ఉద్దేశం. మమత జీవితాన్ని తెరకెక్కిస్తే సినిమా టైటిల్‌ సీఎం మమత బెనర్జీ అని పెట్టేవాళ్లం కదా’ అని ఆయన ప్రశ్నించారు.

ఈ సినిమా 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తయిందని కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్, గ్రాఫిక్‌ వర్క్‌ మిగిలిపోవడంతో ఇన్నాళ్లు టైమ్‌ పట్టిందని నిర్మాత పింకీ పాల్‌ వెల్లడించారు. బీజేపీ పశ్చిమబెంగాల్‌ నేతలు ఎన్నికలు పూర్తయ్యే దాకా ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ బెంగాల్‌ శాఖ ఉపాధ్యక్షుడు జోయ్‌ ప్రకాశ్‌ మజందార్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ మోదీ బయోపిక్‌ తరహాలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఒక్కసారి చూసి సమీక్షించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఈ సినీ దర్శక నిర్మాతలు మమతా బెనర్జీకి వీరాభిమానులు. అలాంటప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎన్నికలయ్యాకే దీనిని విడుదల చేయాలి’ అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top