
సాక్షి, హైదరాబాద్: పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య ఉన్న తేడాతో ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని టీపీసీసీ ఆరోపించింది. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి ఎన్నికల కమిషన్ వ్యవహారం అనుమానాస్పదంగానే ఉందని టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి ఎన్నికలరోజు వరకు 3 నెలల గడువున్నా ఓటర్ల సవరణ ప్రక్రియను అర్ధంతరంగా రద్దు చేసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు కారణమైం దని దుయ్యబట్టారు. ఈవీఎం మెషిన్ల వెరిఫికేష న్ సరిగా చేయకుండా, సిబ్బందికి సరైన అవగాహన కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఓట్లను ప్రకటించడంలో జరిగిన జాప్యం గూడుపుఠాణీకి ఆస్కారమిస్తోందన్నా రు. ఈ అంశాల్లో ఎన్నికల సంఘం స్వీయ పరి శీలన చేసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాల ని, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.