‘స్థానిక’ ఎన్నికల వ్యవధి కుదింపు 

Duration of the Local Body Election is Compressed - Sakshi

నోటిఫికేషన్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకు 20 రోజుల్లో ముగించాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమేష్‌కుమార్‌

ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌

గ్రామీణ, పట్టణ ఎన్నికలు ఒకేసారి జరిగినా సిద్ధంగా ఉండాలని ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి జరిగే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ కాల వ్యవధిని 27 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం 20 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందరరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను, మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలుచేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని రమేష్‌కుమార్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఓటర్ల జాబితా నవీకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సులు.. ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవడంపై కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు. 

‘స్థానిక’ ఎన్నికలన్నీ ఏకకాలంలో జరిగినా..
కాగా, మున్సిపల్‌ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అదనపు ఎన్నికల మెటీరియల్, యంత్రాంగాన్ని సమకూర్చుకునేలా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్‌ కమిషనర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రమేష్‌కుమార్‌ జిల్లా అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో.. సర్పంచ్‌ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించాల్సి ఉంటుందని, ఆ దిశగా కలెక్టర్లు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు. మార్చిలో ఇంటర్, టెన్త్‌ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఎన్నికల షెడ్యూల్‌ ఉంటుందని రమేష్‌కుమార్‌ జిల్లాల అధికారులకు తెలిపారు. మున్సిపల్‌ శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన 10 మున్సిపాలిటీలకు సంబంధించి విడిగా మార్గదర్శకాలను జారీచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్‌ సెక్రటరీ ఏవీ సత్యరమేష్, విశాఖపట్నం నుంచి మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top