దేవెగౌడ నామినేషన్‌

Deve Gowda files nomination from Tumkur lok sabha - Sakshi

పోటీలో కాంగ్రెస్‌ రెబల్‌

బెంగళూరు: జనతాదళ్‌(సెక్యులర్‌) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(85) సోమవారం కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన జేడీఎస్, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా తుముకూరు సిట్టింగ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ ముద్ద హనుమగౌడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కాంగ్రెస్‌ కండువా ధరించి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. చివరి నిమిషంలోనైనా తనకే కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. రాజన్న అనే మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తుముకూరు నుంచి నామినేషన్‌ చేశారు.

కాంగ్రెస్, జేడీఎస్‌ శ్రేణులు విభేదాలను వీడి, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్‌ 8, కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి తన మనవడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్‌ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పోటీ చేస్తున్న తుముకూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీతోపాటు జేడీఎస్‌ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సిట్టింగ్‌ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబానికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవెగౌడ గెలుపు అంత సులువు ఏమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top