
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అలబామా రాష్ట్ర ప్రజలు షాకిచ్చారు. అలబామా సెనేట్ స్థానానికి ట్రంప్ బలపర్చిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రాయ్ మూర్.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి డౌగ్ జోన్స్ చేతిలో ఓడిపోయారు. దీంతో దాదాపు పాతికేళ్ల తర్వాత అలబామాలో డెమొక్రటిక్ పార్టీ గెలిచినట్లైంది.
రిపబ్లికన్ల కంచుకోటగా పేరుగాంచిన అలబామాలో జోన్స్‌కు 49.92 శాతం ఓట్లు రాగా, మూర్‌కు 48.38 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఫలితాలతో 100 మంది సభ్యులుండే సెనేట్‌లో రిపబ్లికన్ల బలం 51 స్థానాలకు పడిపోయింది. తనను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు జోన్స్ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ స్పందిస్తూ ‘తీవ్రంగా పోరాడి గెలిచిన జోన్స్‌కు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఫలితాలను అంగీకరించేందుకు మూర్ నిరాకరించారు.