టెన్షన్‌.. కేజ్రీవాల్‌ ఇంటికి 70మంది పోలీసులు

Delhi police accupy cm kejriwal house - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి విషయంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చారు. దాడికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయోమోనని ఇళ్లు మొత్తం సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ చర్యను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. తన ఇంట్లో సోదాలు చేయడం కాదని, పోలీసులకు దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను లోయా కేసు విషయంలో ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేతలు అశుతోష్‌, సంజయ్‌ సింగ్‌ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

తమ పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు కావాలనే అరవింద్‌ కేజ్రీవాల్‌ సలహాదారుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి వారికి అనుకూలంగా మార్చి ప్రకటన చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి అరుణోదయ్‌ ప్రకాశ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం 60 నుంచి 70 మంది పోలీసులు కేజ్రీవాల్‌ నివాసం చేరుకున్నారు. 'సీఎం ఇంటిని పూర్తిగా పోలీసులు ఆక్రమించారు. పెద్ద మొత్తంలో ఎలాంటి అనుమతి లేకుండానే పోలీసులు ప్రవేశించారు. ఢిల్లీ పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యంలో కనీస మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులున్నాయి. పేదలకోసం, ఒక మంచి సమాజం కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఇంత దారుణంగా అవమానిస్తారా?' అని అరుణోదయ్‌ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top