నేరస్తుల డేటాతో సరిపోల్చి సెకన్లలో అప్రమత్తంచేయనున్న స్మార్ట్ గ్లాసెస్
గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ఏఐ నిఘా
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే కళ్లద్దాలు ధరించనున్నారు! ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)తో పనిచేసే ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే బలగాలను హెచ్చరిస్తాయి!
తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్‌గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితున్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు.
ఎరుపొస్తే పట్టివేత
‘‘ ఏఐ స్మార్ట్‌గ్లాస్ ఆయా పోలీస్ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌కు వెంటనే సందేశం పంపుతుంది. ఆ సందేశంలో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్‌లను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనావా కావా?
వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేవి పోలీసులు నిర్ణయించి తగు రీతిలో స్పందిస్తారు’’ అని ఏసీపీ దేవేశ్ వెల్లడించారు. ‘‘వ్యక్తుల చరిత్రను తక్షణం గుర్తించడం అనే ఈ ప్రక్రియ కారణంగా గతంలో మాదిరి ఒక్కో వ్యక్తిని మాన్యువల్‌గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. దీనికితోడు విస్తృతంగా ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్‌లతో పర్యవేక్షణ, ఏఐ ఆధారిత విశ్లేషణ విధానాలతో ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలనూ వేగంగా గుర్తించవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.
20 ఏళ్ల పాత ఫొటో అయినాసరే..
‘‘ మా దగ్గర ఉన్న డేటాబేస్‌లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితంనాటి ఫొటో ఉన్నాసరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్‌గాŠల్‌స్ అనేది సరిపోల్చుకోగలదు. అంతటి సామర్థ్యం ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్‌కు ఉంది. స్మార్ట్ గ్లాసెస్ చూపు నుంచి నేరస్తులు తప్పించుకోలేరు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యమూ ఉంది. ఇనుము, ఉక్కు లోహాలు సహా పదునైన వస్తువులు, నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులనూ ఇవి గుర్తించగలవు.
సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు ఈ కళ్లద్దాలను ఇస్తున్నాం. పోలీసు వాహనాల ముందుభాగంలోనూ వీటిని అమర్చుతాం. గణతంత్ర వేడుకల్లో వీటిని ఢిల్లీలో ఉపయోగించడం ఇదే తొలిసారి’’ అని అధికారి చెప్పారు. అయితే ఎన్నింటిని కొనుగోలు చేశారో, వాటి ధర తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘‘ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతు మార్గంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో మొత్తంగా 10,000 మంది పోలీసులను న్యూఢిల్లీ జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రతి వాహనం మూడంచెల భద్రతావలయాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.


