ఆప్‌.. ఆప్‌ హుర్రే

Delhi Election Results Effect on Tamil Nadu Politics - Sakshi

తమిళనాడు రాజకీయాల్లో ఢిల్లీ ఫలితాల ప్రభావం

మరో కేజ్రీవాల్‌గా కమల్‌హాసన్‌ ఆశాభావం

అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు

చిదంబరం అభినందన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ చిందులు

కస్సుబుస్సంటున్న కుష్బు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రానికే పరిమతం కాలేదు. తమిళనాడుకు సైతం గెలుపోటముల ఫలితాల సెగలు తాకాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యల కలకలం సృష్టించాయి. కేజ్రీవాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్‌ సమాయత్తం అవుతున్నారు. ఈమేరకు పరోక్షంగా ట్వీట్‌ కూడా చేశారు. (చదవండి: చిదంబరంజీ.. మన దుకాణం మూసేద్దాం..!)

గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్‌ పార్టీ 4 శాతం ఓట్లను సాధించింది. కనీసం ఒక్కసీటును కూడా గెలవకున్నా ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించగలిగింది. 11 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో అతిపెద్దపార్టీగా గుర్తింపుపొందింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆప్‌ సాధించిన విజయాలను తలచుకుంటూ కమల్‌హాసన్‌ జోరుపెంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీని మట్టికరిపించి ఆప్‌ ఆమోఘ విజయం సాధించడం కమల్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికలను ఢీకొనాలని ఆయన ఆశిస్తున్నారు. మొత్తం 234 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ఇటీవల క్షేత్రస్థాయి నియామకాలతో పార్టీని బలోపేతం చేశారు. ఈనెల 21న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున ఎన్నికల బృందాన్ని ప్రకటిస్తారు. ఆ తరువాత నుంచి ఎన్నికల ప్రచార పర్యటనల్లోకి దిగుతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పనులను ప్రారంభించనున్నారు.

అలాగే మొత్తం 234 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు సన్నద్దులు అవుతున్నారు. అరవింద్‌ కేజ్రీవాలను అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్‌లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయాన్ని అందుకునేందుకు మీరు మార్గం చూపారు. పార్టీ స్థాపనకు ముందుగానే కేజ్రీవాల్‌ను కలిసిన కమల్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన బాణీని ఆచరణలో పెట్టి గెలుపు గుర్రం ఎక్కాలని తహతహలాడుతున్నారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీపార్టీ ఆమోఘ విజయం సాధించింది, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు చోటుచేసుకోవాలని ఆశిస్తున్నట్లు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్‌ తెలిపారు. ఢిల్లీ నుంచి మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కమల్‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలతో అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీని మట్టికరిపించి ఆప్‌ ఘనవిజయం సాధించింది, అవే పరిణామాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆశిస్తున్నారా అనే ప్రశ్నకు ‘ఖచ్చితంగా’ తమిళనాడులో కూడా జరగాలని కోరుకుంటున్నానని బదులిచ్చారు.

రజనీతో రాజీ యత్నాలు..
కమల్‌ రాజకీయాల్లోకి దిగి పార్టీని స్థాపించారు. రాజకీయ ప్రవేశం చేసిన రజనీకాంత్‌ పార్టీని స్థాపించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే తరచూ రాజకీయపరిణామాలపై స్పందిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వెండితెరపైనే కాదు రాజకీయతెరపై కూడా వారిద్దరివి భిన్నధృవాలుగా సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా చాలా తేడాలున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. పౌరసత్వ చట్టంపై కమల్‌ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రజనీ పరోక్ష మద్దతుదారుగా వ్యవహరిస్తుండగా, కమల్‌ తీవ్రవ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాబోయే ఎన్నికల్లో కమల్, రజనీ ఏకం కావాలనే అభిప్రాయం ఇటీవల బయలుదేరింది. సిద్ధాంతాలపరంగా ఎంతమాత్రం పొసగని రజనీ, కమల్‌ ఎలా ఎకం అవుతారనే వాదన కూడా వినిపిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకేలను ధీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే ఇద్దరూ ఏకమై ఎన్నికల బరిలో దిగకతప్పదని రాజకీయ  పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ దశలో కొందరు రజనీ, కమల్‌ మధ్య రాజకీయ రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారు.  

ఖుష్బు కస్సుబుస్సు..
కాంగ్రెస్‌ పార్టీతీరు ఏమాత్రం బాగోలేదు, అందుకే ఢిల్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటి ఖుష్బు ట్విటర్‌ ద్వారా విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఏదో మాయాజాలం జరుగుతుందని ఎంతమాత్రం ఎదురుచూడలేదు, కాంగ్రెస్‌ పార్టీ మరలా పతనమైంది. మేము ప్రజలనాడికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా, సరైన మార్గంలో పయనిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే లేదనే బదులువస్తోంది. పార్టీకి పునర్వైభవం కోసం ఇప్పటి నుంచే శ్రమించాలి, ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ చేయలేము. క్షేత్రస్థాయి ఉంచి అధిష్టానం వరకు అనేక విషయాలపై సంస్కరించాలి. నీవు కోరే మార్పును నీతోనే ప్రారంభించు అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలు ఇపుడు అనుసరణీయం. భయాల నుంచి బయటకు రావాలి అంటూ కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆమె ఘాటుగా ట్వీట్‌ చేశారు.

చిదంబరం వ్యాఖ్యల చిచ్చు..
బీజేపీ ఓటమికి కారణమైన ఆప్‌ను అభినందిస్తున్నానని చిందబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలానికి కారణమైనాయి. కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయానికి చింతించకుండా ఆమ్‌ ఆద్మీపార్టీ గెలుపును అభినందించడమా అంటూ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరంపై మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు షర్మిష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కారణాలపై విశ్లేషించుకోవాల్సిన తరుణంలో చిదంబరం మాటలు ఏమిటని నిలదీశారు. పార్టీ నేతలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top