ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.
70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి