కాషాయంతో కమ్యూనిస్టుల దోస్తీ! | CPM Supports To BJP In Bengal | Sakshi
Sakshi News home page

కాషాయంతో బెంగాల్‌ కమ్యూనిస్టుల దోస్తీ!

May 15 2019 6:58 AM | Updated on May 15 2019 6:58 AM

CPM Supports To BJP In Bengal - Sakshi

శ్రామికవర్గం కోసం పోరాటమే పునాదిగా పుట్టుకొచ్చిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజకీయ నీతిని ఒంటబట్టించుకున్న కమ్యూనిస్టులు బెంగాల్‌లో తృణమూల్‌ను ఓడించేందుకు బీజేపీకి లోపాయికారీగా సహకరిస్తున్నారు. 34 ఏళ్ల తమ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండి కొట్టడమే కాక తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీని గద్దెదింపడం కోసం సీపీఎం శ్రేణులు క్షేత్ర స్థాయిలో బీజేపీకి సహాయసహకారాలు అందిస్తున్నాయి. బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు కష్టపడుతున్నారు. అయితే, చాలా నియోజకవర్గాల్లో బూత్‌ స్థాయిలో వారికి బలం లేదు. దాంతో ఆయా స్థానాల్లో ఊహించని వర్గాల (సీపీఎం కార్యకర్తలు) మద్దతుపై ఆధారపడుతున్నారు.

ఈ విషయాన్ని బీజేపీ పోల్‌ మేనేజర్లే స్వయంగా చెబుతున్నారు. సీపీఎం కార్యకర్తలు బూత్‌ స్థాయిలో బీజేపీకి సహకరించడమే కాక తమకు బలం ఉన్న చోట్ల బీజేపీకి ఓటెయ్యమని లోపాయికారీగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఉదాహరణకు కోల్‌కతా ఉత్తర్‌ నియోజకవర్గంలో 1862 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిలో కేవలం 500 కేంద్రాల్లో మాత్రమే బీజేపీకి కార్యకర్తలున్నారు. మిగతా చోట్ల సీపీఎం వాళ్లే బీజేపీ తరఫున పనిచేస్తున్నారు. బీజేపీ పోల్‌ మేనేజర్లు సీపీఎం కార్యకర్తలతో రోజూ రహస్య సమావేశాలు జరుపుతూ ఇంటింటి ప్రచారానికి వ్యూహాలు పన్నుతున్నారు. పోలింగ్‌ రోజున బీజేపీ ఏజెంట్లు లేని బూత్‌లలో సీపీఎం కార్యకర్తలు బీజేపీకి పని చేయాలని ఇరు పక్షాల మధ్య అలిఖిత ఒప్పందం కూడా కుదిరిందని తెలుస్తోంది. ఈ విషయం సీపీఎం అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తోంది.

బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న  పార్టీశ్రేణులకు పొలిట్‌ బ్యూరో రెండు రోజుల క్రితం హెచ్చరిక కూడా చేసింది.‘తృణమూల్‌ నుంచి రక్షణ కోసం బీజేపీని నమ్ముకోవడమన్న పొరపాటు చేయకండి. ఒక సారి త్రిపుర అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. బీజేపీతో చేతులు కలపడమన్నది ఆత్మహత్యా సదృశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయంవైపు మళ్లొద్దు’ అని పొలిట్‌ బ్యూరో బెంగాల్‌ సీపీఎం శ్రేణులను హెచ్చరించింది. దీదీ దెబ్బతో చాలాచోట్ల సీపీఎం బలం నామమాత్ర స్థాయికి పడిపోయిందని, బీజేపీతో చేతులు కలపడం ద్వారా  కమ్యూనిస్టులు తమ ఉనికిని కూడా కోల్పోతున్నారని పరిశీలకులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement