బీజేపీది పౌరులను విభజించే కుట్ర

CPM State Secretary Tammineni Veerabhadram Slams On BJP - Sakshi

సాక్షి, ఖమ్మం: బీజేపీ ప్రభుత్వం దేశంలోని పౌరుల మధ్య చిచ్చు పెట్టి వారిని విభజించే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులను విభజించి తద్వారా రాజకీయంగా స్థిరపడాలని, హిందూ మత ఆధిపత్యాన్ని నెలకొల్పాలని, హిందూ ధర్మ రాజ్యాన్ని స్థాపించాలనే రహస్య ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. గురువారం స్థానిక మంచికంటి భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ప్లీనంలో ఆయన మాట్లాడారు.  మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్‌ బ్యాంకు నుంచి రూ.1.75 లక్షల కోట్ల నిధులను మళ్లించారని ఆరోపించారు. మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ.లక్ష కోట్ల ఆస్తులున్న ముఖేష్‌ అంబానీ ఆస్తులు నేడు రూ.19 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

కొన్ని దశాబ్దాల కాలంలో లేనటువంటి విధంగా ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోయారని, దీన్ని మెరుగుపర్చకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై కుప్పకూలిపోతుందని ఆర్థిక శాస్త్రం నోబుల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. మహిళలపై, చిన్నారులపై, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఎం కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నెపల్లి సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, బండి రమేష్‌ అఫ్రోజ్‌ సమీనా తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top