పూర్వ వైభవం కోసం సినీ నటి సహకారం..

CPI Leader Narayana Slams To NDA GoVernment - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పతనం ప్రారంభమయిందని జోష్యం చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్‌ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్‌ఎస్ఎస్ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శిఖండి పాత్ర పోషిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది ఎన్డీయేకు బీ ఫ్రంట్‌. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా అందర్నీ సమీకరిస్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెబుతుంది. దీనిపై కేంద్రం మీద కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి. బాంచెన్ దొర అంటూ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారు.

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలి. కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు పొందుదామనుకోవడం భ్రమే. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుంది. తెలంగాణను వ్యతిరేకించిన వారు క్యాబినెట్‌లో ఉన్నార’ని నారాయణ ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top