56 అంగుళాల ఛాతీ ఎక్కడ?

Corona Virus: Kapil Sibal Slams PM Modi Over Lifting of Drug Ban - Sakshi

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మెతక వైఖరి వల్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ట్రంప్‌ బెదిరింపులకు లొంగి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని పాక్షికంగా సడలించిందని ఆరోపించింది. ‘మోదీజీ, చైనీస్ చొరబాట్లపై యూపీఏ మీ సలహాను గుర్తుంచుకుంటుంది. మీరు వారి కళల్లో చూడండి అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్‌ కళ్లలో చూడాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన బెదిరించారు. మీరు అనుమతి ఇచ్చేశారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు. 

కరోనా నివారణలో సమర్థవంతంగా పనిచేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ తమకు ఇవ్వకపోతే వాణిజ్యపరంగా ప్రతీకారం తప్పదని డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ బెదిరింపులను కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌, జైవీర్‌ షెర్గిల్‌ ఖండించారు. తన రాజకీయ జీవివంతో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు దిగడం ఎప్పుడూ చూడలేదని శశిథరూర్‌ పేర్కొన్నారు. భారత్‌ తనకు ఇష్టమైనప్పుడే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలను అమెరికాకు ఎగుమతి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాణాలను రక్షించే మందులు మొదట భారతీయులకు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచాలని, తర్వాతే మిగతా దేశాలకు సరఫరా చేయాలని రాహుల్‌ గాంధీ అన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top