అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం! | Sakshi
Sakshi News home page

అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!

Published Mon, Sep 9 2019 3:49 AM

Congress slams BJP Govt on completion of 100 days - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అహంకారం, రాజకీయ ప్రచారం, అనిశ్చితి, ఆందోళన, డోలాయమానంగా బీజేపీ పాలన సాగిందంటూ ఆరోపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ గత బడ్జెట్‌ సమావేశాల్లో 39 బిల్లులను ప్రవేశపెట్టి 28 బిల్లులను ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఏ ఒక్క బిల్లును కూడా పరిశీలన కోసం సెలెక్ట్‌ కమిటీకి గానీ, స్టాండింగ్‌ కమిటీకిగానీ పంపలేదన్నారు.

గత వంద రోజుల్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు తప్పించుకొనేలా మార్గ్గం సుగమం చేస్తున్నాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, అస్సాంలో ఎన్‌ఆర్‌సీతో దేశంలో అనిశ్చితి సృష్టించిందన్నారు. ఆటోమొబైల్‌ రంగం తిరోగమనంలో ఉందని, 3.50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధి తగ్గి, చేనేత, బంగారం ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement