అంతర్మథనంలో పొంగులేటి

Congress MLC Ponguleti Sudhakar Reddy upsets over khammam seat - Sakshi

పొత్తు పేరుతో తనను పోటీ నుంచి తప్పించారని ఆవేదన

టీపీసీసీ పెద్దల కుట్రేనంటున్న సన్నిహితులు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడి నుంచి అన్ని హోదాల్లో పనిచేసిన నాయకుడిగా, ఆలిండియా యూత్‌కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదిన్నరేళ్లు ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసిన తనకే అసెంబ్లీ టికెట్‌ కేటాయింపులో అన్యాయం జరిగిందనే అవమానంతో ఆయన సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.

35 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించకుండా పొత్తు పేరుతో పొంగులేటి ఆశించిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని దక్కకుండా కొందరు టీపీసీసీ పెద్దలు కుట్ర చేశారనే భావనలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఐతో, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని పొంగులేటికి టికెట్‌ రాకుండా చేశారని చెబుతున్నారు. పార్టీలో పదవులు రాకుండా అడ్డుకున్న నేతలే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు.

పథకం ప్రకారమే టీపీసీసీ ముఖ్యులు ఇదంతా చేశారని భావిస్తున్న పొంగులేటి వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొంగులేటిని బుజ్జగించేందుకు గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా రాహుల్‌గాంధీతో సంబంధాలున్న ఆయనకు పార్టీలో అన్యాయం జరగకుండా చూస్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను కీలకంగా ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ టికెట్‌ ఆశించి రాకపోవడంతో రెబెల్స్‌గా బరిలో ఉన్న తండు శ్రీనివాసయాదవ్‌ (సూర్యాపేట), దళ్‌సింగ్‌ (ఇల్లెందు), ఎండీ ఫజల్‌ (ఖమ్మం), కె.శ్రీరాములు (అశ్వారావుపేట) తదితరుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని కూడా ఆయనపై ఏఐసీసీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. పొంగులేటి మాత్రం తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడంలో టీపీసీసీ పెద్దలు అన్యాయం చేశారనే అవమానభారంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరి అధిష్టానం బుజ్జగింపులతో పొంగులేటి సర్దుకుంటారా..? పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై రాహుల్‌కు ఫిర్యాదు చేస్తారా..? తొలి నుంచీ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆయన ఖమ్మంలో ఆ పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top