
తుమకూరు: ఓటు కావాలంటే ఓటరు దేవుణ్ని వేడుకోవాలి, ఈయన మాత్రం సరదాగా బెదిరింపులకే దిగడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాకుండా మరో పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీకు మంచి రోజులు ముగిసినట్లేనని జిల్లాలోని మధుగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎన్.రాజణ్ణ ప్రజలను సరదాగా బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. బుధవారం మధుగిరి పట్టణంలోని మండ్ర కాలనీలో నిర్వహించిన పార్టీ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మధుగిరిని అభివృద్ధి చేసింది తామేనన్నారు. అటువంటి తమకు కాకుండా ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీకు చెడు కాలం దాపురించినట్లేనంటూ చేసిన వ్యాఖ్యలు టీవీలు, సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.