కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే హరిప్రియ రాజీనామా

Congress MLA Haripriya Resigned From The Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ’హస్తం’ కు చేయిచ్చి కారు ఎక్కేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌కు షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి సబితా ఇంద్రారెడ్డి..!
తాజాగా ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ బీఫాంపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై ఇప్పటికే ఆమె...టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరికపై రేపు ఉదయం (సోమవారం) తన అనుచరులతో సబితారెడ్డి సమావేశం కానున్నారు. కార్యకర్తల భేటీ అనంతరం ఆమె కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది.

కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన నేపథ్యంలో పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ కు చిక్కడంతో తెలంగాణ కాంగ్రెస్లో గుబులు రేపుతోంది. పార్టీ మారుతున్నట్లు వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డితో కాంగ్రెస్‌ నేతలు భేటీ బుజ్జగింపుల పర్వం చేపట్టినా అవి సఫలం కాలేదని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top