బిజీ లీడర్స్‌

Congress Leaders Buzzy With Election Campaign - Sakshi

వార్‌రూం భేటీకి సిటీ నేతలు

ప్రజాకూటమి స్థానాలపై స్పష్టత

సిటీలో గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినవారి జోరు

సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో సీట్ల పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల నుంచి పలువురు అభ్యర్థులు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ వార్‌రూం ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ అందుకున్న గ్రేటర్‌లోని అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. నగరంలో సికింద్రాబాద్, అంబర్‌పేట తదితర నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు ఢిల్లీ బాటపట్టారు. వీరితోపాటు పొత్తుల్లో స్థానాలు కోల్పోతున్న నియోజకవర్గాల నేతలు ఢిల్లీలో పీసీసీ, ఏఐసీసీ నాయకులతో భేటీ అయ్యారు. సికింద్రాబాద్‌ స్థానానికి పోటీ తీవ్రంగా ఉండడంతో గురువారం మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి, టికెట్‌ ఆశిస్తున్న పల్లె లక్ష్మణరావుగౌడ్‌ వార్‌రూం భేటీకి హాజరయ్యారు. మల్కాజిగిరి స్థానం తెలంగాణ జన సమితికి, టీడీపీకి ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, పటాన్‌చెరు స్థానాలు దాదాపు ఖరారు కావడంతో ఈ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఏఐసీసీ భేటీ కానుంది. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వలేకపోతున్నామని, భవిష్యత్‌లో న్యాయం చేస్తామన్న హామీ ఇస్తున్నట్లు ఢిల్లీ వెళ్లిన నేతలు చెబుతున్నారు.

ప్రచారంలో బిజీబీజీ..
పొత్తుల్లో స్థానాల కేటాయింపుతో పాటు అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చిన అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. గోషామహల్‌లో ఎం. ముఖేష్‌గౌడ్, ఎల్బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముషీరాబాద్‌లో అనిల్‌కుమార్‌ యాదవ్, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్‌ ఇప్పటికే విస్తృత పర్యటనల్లో నిమగ్నమయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, జూబ్లిహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లోశశిధర్‌రెడ్డి, కంటోన్మెంట్‌లో సర్వే, నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్‌ పేర్లను ఎన్నికల కమిటీ సైతం క్లియర్‌ చేసిందన్న సమాచారంతో వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.  

ఇంటి మొహం చూడలే..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఏకధాటిగా గురువారం 18వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్‌ పార్టీ కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్‌ నాయకుల ఇళ్లలోనే చేస్తున్న సుధీర్‌రెడ్డి.. రాత్రి నిద్ర కూడా తమ వెంట ఉన్న వాహనాల్లోనే చేస్తున్నారు. రోజుకు 25 నుంచి 30 కి.మీ మేర యాత్ర చేస్తున్న ఆయన 22 రోజుల్లో 872 కానీల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top