‘కర్ణాటకం’పై నిరసనలు

Congress to hold protests against BJP in all districts - Sakshi

నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు, ర్యాలీలు

గాంధీ భవన్‌లో ముఖ్య నేతల భేటీ

బీజేపీ కార్యాలయ ముట్టడికి మాజీ ఎంపీ అంజన్‌ యత్నం, అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనుంది. ఈ ఆందోళనల్లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలను రాష్ట్రంలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఏఐసీసీ నుంచి గురువారం కబురు రావడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులతో సమావేశమై శుక్రవారం నిర్వహించాల్సిన ఆందోళనలపై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో చర్చించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.

అప్రజాస్వామిక చర్య: కుంతియా
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం అప్రజాస్వామికమని కుంతియా విమర్శించారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అవుతానని యడ్యూరప్ప ముందుగానే చెప్పారంటేనే బీజేపీ ఈ విషయంలో కుట్రతో వ్యవహరించిందని అర్థమవుతోందన్నారు.

బీజేపీ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న ఆందోళన కార్య క్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నా సీఎం కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదని షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌ ఈ విషయంలో నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గుర్తించాలని, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

మోదీ దిష్టిబొమ్మ దహనం...
కర్ణాటకలో బీజేపీ అనుసరిస్తున్న అనైతిక రాజకీయాలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ల నేతృత్వంలో పలువురు కార్యకర్తలు గాంధీభవన్‌ నుంచి బీజేపీ కార్యాలయం వైపు బయలుదేరగా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్‌ నేతలు అక్కడే ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, అరెస్టు చేసిన నేతలను పోలీసులు బేగంబజార్‌ పీఎస్‌కు తరలించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top