ప్రధాని క్షమాపణ చెప్పాలి

Congress demands apology from Narendra Modi after RBI report - Sakshi

నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ డిమాండ్‌

13,000 కోట్ల డీమోనిటైజేషన్‌.. కానీ, జీడీపీ నష్టం రూ.2.25 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చాయని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ అవకాశంగా మలుచుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. డీమోనిటైజేషన్‌ కోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందని, ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. రూ.3 లక్షల కోట్ల మేర అక్రమ నగదు వ్యవస్థలోకి వస్తుందని 2017 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారని, అబద్ధం చెప్పినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. ఇతిహాస లెక్కల ఆధారంగా మోదీ సృష్టించిన విపత్తు డీమోనిటైజేషన్‌ అని ఆర్‌బీఐ నివేదిక మరోసారి నిరూపించిందన్నారు.

మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం సైతం స్పందించారు. డీమోనిటైజేషన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, పరిశ్రమల మూతపడటం, వృద్ధి రేటు తగ్గడం వంటి సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొందని చిదంబరం అన్నారు. కేవలం రూ.13,000 కోట్ల మేరే డీమోనిటైజేషన్‌ జరిగినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయని, ఇందుకోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందన్నారు. ‘వృద్ధి రేటు పరంగా దేశ జీడీపీ 1.5 శాతం మేర నష్టపోయింది. దీనివల్లే రూ.2.25 లక్షల కోట్ల నష్టం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది రోజువారీ వేతన జీవులు కొన్ని వారాల పాటు తమ ఉపాధి కోల్పోయారు. వేలాది ఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడ్డా యి’అని చిదంబరం ట్వీట్‌ చేశారు.

రాఫెల్‌పై వాగ్యుద్ధం
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో..రాహుల్‌ బదులు కోరుతూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ 15 ప్రశ్నలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కన్నా 20 శాతం తక్కువ ధరలకే రాఫెల్‌ విమానాలను కొనుగోలుచేస్తున్నామని తెలిపారు. దీనికి రాహుల్‌ స్పందిస్తూ.. రాఫెల్‌ ఒప్పందాన్ని ఘరానా దోపిడీగా అభివర్ణించారు. వ్యాపారవేత్త అయిన స్నేహితుడిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top