రాజస్తాన్‌ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం

Congress Claims We Have Audio Tapes Against Ashok Gehlot Government - Sakshi

జైపూర్‌/ఢిల్లీ: రాజస్తాన్‌ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్‌ ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బీజేపీ నేత సంజయ్‌ జైన్‌ యత్నించారని పేర్కొంటూ కాంగెస్‌ పార్టీ రాజస్తాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్‌ఓజీ పోలీస్‌ అధికారులను కోరారు. కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సంజయ్‌ జైన్‌, భన్వర్‌లాల్‌ శర్మపై ఎస్‌ఓజీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సమాచారం. 
(చదవండి: రాజకీయ సంక్షోభం: వసుంధరపై సంచలన ఆరోపణలు)

ఇక ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబెరికిన కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసింది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్‌ రద్దు చేసింది. వారికి షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. కాగా, కాంగ్రెస్‌ ఆరోపణనలన్నీ అవాస్తవాలేనని రెబల్‌ ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తమకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ మహేష్‌ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్తాన్‌ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులపై సచిన్‌ పైలట్‌ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు కాసేపట్లో విచారించనుంది.
(19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నోటీసులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top