కుడి ఎడమైన ఎన్నికల ప్రచారం

Congress, BJP Election Campaign - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్‌ ఓడిపోరాదోయ్‌!’ అన్నట్లుగా పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు రానున్న ఎన్నికలకు రణ తంత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇరు పార్టీలు తమ విధేయులను అక్కున చేర్చుకుంటూనే కొత్త వర్గాలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఇరు పార్టీలు కూడా కొంత అగమ్యగోచరంలో పడిపోతున్నాయి.

ఒకప్పుడు బ్రాహ్మణ్‌–బణియన్‌ పార్టీగా ముద్ర పడిన బీజేపీ, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక వెనుకబడిన వర్గాల వారిని, షెడ్యూల్డ్‌ కులాల వారిని దరి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం అంబేడ్కర్‌ పేరిట వరుస సంస్మరణ కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగానే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది. షెడ్యూల్డ్‌ కులాల వేధింపుల నిరోధక చట్టంను సడలిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో భగ్గుమన్న దళితులు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంతో దిగివచ్చిన మోదీ ప్రభుత్వం దళితులను మెప్పించడం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఆది నుంచి పార్టీని నిలబెట్టిన అగ్ర కులాల వారు ‘ఎటూ పోలేరులే’ అనుకుని ఈ చర్యలకు పూనుకుంది. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒరుగుతుందని, ముఖ్యంగా శాశ్వతంగా రిజర్వేషన్లను ఎత్తివేస్తారని భావించిన అగ్రవర్ణాల వారు కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమకు రిజర్వేషన్లు కావాలంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. గుజరాత్‌లో పటేళ్లు, యూపీలో ఠాకూర్లు, మహారాష్ట్రలో మరాఠాలు, హర్యానాలో జాట్ల ఆందోళన అలాంటివే. ఎస్సీల వేధింపు చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ధరించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఎత్తివేయాలని ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాల వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు, ఎస్సీలను దూరం చేసుకోకుండానే అగ్ర వర్ణాల వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక పాలక పక్ష బీజేపీ అగమ్యగోచరంలో పడింది. అయితే అన్ని రాష్ట్రాల్లో వాజపేయి అస్థికల కళశాల ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా తిరిగి బ్రాహ్మణులను ఆకట్టు కోవచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకప్పుడు అగ్రవర్ణాలు, దళితులు, మైనారిటీల పార్టీగా పలు వర్గాల మద్దతు కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ‘మైనారిటీల పార్టీ’గా బీజేపీ వేసిన ముద్రను చెరపేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీ వ్యతిరేకత కారణంగా మైనారిటీలు ఎలాగైనా కాంగ్రెస్‌ వైపే ఉంటారన్న విశ్వాసంతో అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అవకాశం దొరికినప్పుడల్లా దేవాలయాలను సందర్శిస్తున్నారు. తనను తాను శివభక్తుడిగా చెప్పుకున్న ఆయన ప్రస్తుతం మానస సరోవరం యాత్రలో ఉన్నారు. ఆఖరికి రాహుల్‌ గాంధీ జంధ్యం ధరించే బ్రాహ్మణుడు అంటూ గతేడాది కాంగ్రెస్‌ పార్టీ అధికారి ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఓ బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో బ్రాహ్మణ సమాజం డీఎన్‌ఏ కలిసి ఉందని వ్యాఖ్యానించారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు బ్రాహ్మణ కళ్యాణ బోర్డును పార్టీ ఏర్పాటు చేస్తుందని, బోర్డు ద్వారా రుణాలు, ఉపకార వేతనాలను ఇస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో గోసంరక్షణ శాలలను ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించడం, పలు రాష్ట్రాల్లో గోవధలను ముందుగా నిషేధించినది కాంగ్రెస్‌ ప్రభుత్వాలనేనని పార్టీ మరో సీనియర్‌ నాయకుడు మనీష్‌ తివారీ వ్యాఖ్యానించడం బ్రాహ్మణులను ఆకర్షించడంలో భాగమేనన్నది సుస్పష్టం.

అయితే రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆందోళనపై స్పందించే విషయంలో అగమ్యగోచరంలో పడిపోతోంది. ఈ అంశంపై రాహుల్‌ గాంధీ పూర్తి మౌనం పాటిస్తుండగా, పార్టీ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆందోళనను విమర్శించాల్సిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ, వారి ఆందోళనను మోదీ వైఫల్యంగా మాట్లాడారు. నేడు దేశంలో పలు వర్గాల వారు ఆందోళన చేయడానికి కారణం మోదీ వారికిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడమేనంటూ విమర్శించారు. అగ్రవర్ణాల దాడులకు గురవుతున్న దళితులు, మైనారిటీల పట్ల ఇరు పార్టీలు పరిమితంగా మాట్లాడుతున్నాయి. ఇక దేశంలో మరోపక్క వ్యవసాయం, ఆర్థిక సంక్షోభాల కారణంగా రైతులు, కార్మికులు, కర్షకులు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది విజయమో తేల్చేదే వారే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top