
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అంతర్గత కలహాలు కర్ణాటకలో తాము తిరిగి గెలిచేందుకు దోహదపడతాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు రాజకీయ ప్రత్యర్థులని, ఆ కూటమి విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎన్నికల సమయంలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేశారు. ఇప్పుడు అగ్ర నేతల మధ్య సత్సంబంధాలతో వారు ఓటర్ల మద్దతు పొందలేరు. రెండు పార్టీల మధ్య అంతర్గత కలహాలు ఏర్పడతాయన్నది సుస్పష్టం’ అని అన్నారు.
మూణ్నాళ్ల ముచ్చటే: సదానంద గౌడ
కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగదని కేంద్రమంత్రి సదానందగౌడ జోస్యం చెప్పారు. ఇరు పార్టీలు అనైతిక పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు.