తెలుగుదేశంలో గందరగోళం

Confusion in Telugu desham party - Sakshi

చంద్రబాబు ప్రకటనతో అయోమయంలో తమ్ముళ్లు

ఇప్పటికే టీడీపీని వీడిన పలువురు సీనియర్‌ నేతలు

3 జిల్లాలు, 9 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు కరువు

మిగిలింది ఎల్‌.రమణ, పెద్దిరెడ్డిలే..

పొత్తులపై స్పష్టతలేక పార్టీ నేతలు, కేడర్‌ తర్జనభర్జన

ఇప్పటికే దయనీయ స్థితిలో దేశం.. చివరకు మిగిలేది ఎవరు..?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్వ కరీంనగర్‌ జిల్లాలో ఒకప్పుడు ఘనమైన చరిత్ర గల పచ్చపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఇటీవల గట్టి షాకే ఇచ్చారు. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా.. ఇంకొందరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమీక్షలో చేసిన ప్రకటనలు మరింత గందరగోళంలో పడేశాయి. పొత్తులపై ఆయన చేసిన అస్పష్టమైన ప్రకటన పార్టీ కేడర్‌లో తర్జనభర్జనలకు తెరతీసింది. తెలంగాణలో పార్టీని వదిలేది లేదని.. విలీనం ఊసే లేదని.. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయంటూనే.. ఎన్నికల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయి. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: 2014లో పొత్తులు పెట్టుకుని, ఇన్నాళ్లు బీజేపీతో అంటగాగిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదనడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఇప్పటికే ఒంటిరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు లేకపోతే ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే. గతంలో టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ  వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పొత్తు ఉంటాయని ప్రకటన చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తోనే పొత్తు ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనని జిల్లా నేతలు భావిస్తున్నారు. 

ఇప్పటికే టీడీపీని వీడిన సీనియర్లు..మిగిలింది ఇద్దరే..
తెలంగాణ టీడీపీలో రెండేళ్లుగా స్థబ్దత నెలకొనడంతో గత ఎన్నికల్లో పార్టీ టికెట్లపై పోటీ చేసిన వారు, కష్టాల్లోనూ పార్టీని పట్టుకొని ఉన్నవారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగారావు, హుస్నాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పేర్యాల రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు కర్రు నాగయ్య గులాబీ కండువా కప్పుకున్నారు.

వీరితోపాటు ఉమ్మడి జిల్లాలోని వీరి అనుచరులు, సీనియర్‌ నేతలు టీడీపీని వదిలి తమ భవిష్యత్‌ను చక్కదిద్దుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో  మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, 9 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు లేకుండా పోయారు. కాగా.. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌ జిల్లాలో మంత్రుల స్థాయిలో పనిచేసి ముఖ్యనేతలుగా ఉన్న తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాత్రమే పార్టీకి పెద్దదిక్కుగా మిగిలారు.

అయినా.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు అధ్యక్షులే లేకుండా పోయారు. అదేవిధంగా కరీంనగర్, రామగుండం, వేములవాడ నియోజవర్గాలకు 2014 ఎన్నికల నాటి నుంచే నియోజకవర్గ అధ్యక్షులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం జగిత్యాలకు రమణ, కోరుట్లకు సాంబారి ప్రభాకర్, ధర్మపురికి జాడిబాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జి లేకపోయినా సీనియర్‌ నాయకుడు, పార్టీ నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. చందా గాంధీ, కందుల ఆదిరెడ్డిలాంటి సీనియర్లు పార్టీ కోసం పని చేస్తున్నారు. 

పొత్తులతో ఎవరికి లాభం.. పార్టీలో మిగిలేది ఎవరు..

టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీతో పొత్తు అనే విషయాన్ని తేల్చకపోయినప్పటికీ టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీని వీడిన నేతల్లో అంతర్మథనం మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే తమ పరిస్థితి ఏంటని టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే జగిత్యాల నియోజకవర్గానికి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది.

జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం చాలా మందే పోటీ పడుతున్నా.. బలమైన నాయకుడు లేకపోవడంతో రమణకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం బెర్త్‌ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పొత్తులో పెద్దిరెడ్డికి హుజూరాబాద్, హుస్నాబాద్‌ స్థానాలు దక్కే అవకాశం లేదు. హుజూ రాబాద్‌కు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్‌కు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితెల సతీష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిని కాద ని పొత్తులో టీడీపీకి ఈ రెండు స్థానాల్లో ఇవ్వడం సాధ్యపడే అవకాశాలు తక్కువే.

టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎన్నికలకు ముందే తన భవితవ్యం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇదిలా వుండగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వలసలతో తెలుగుదేశం పార్టీ ఆవసాన దశకు చేరగా, ఆ పార్టీ నేత చంద్రబాబు ప్రకటన టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొత్తులు వల్ల ప్రతికూల పరిస్థితులు ఉండే మరికొందరు సీనియర్లు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉండగా, పార్టీలో చివరకు ఎవరు   మిగులుతారనే చర్చ జోరందుకుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top