అదో రాజకీయ సమస్య, దాన్ని వదిలేయండి..

CM HD Kumaraswamy Comments On State Cabinet Expansion - Sakshi

సాక్షి బెంగళూరు : కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై శనివారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సమాధానమిచ్చారు. ‘‘ అదో రాజకీయ సమస్య, దాన్ని వదిలేయండి. మేము చూసుకుంటాము. మీరు కంగారుపడాల్సిన అవసరంలేద’’ ని అన్నారు. అయితే.. జనతాదళ్‌ రెండు, కాంగ్రెస్‌ తరఫున ఒకరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నా- రెండు పార్టీలూ చెరో స్థానాన్ని మాత్రమే భర్తీచేశాయి. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్‌.శంకర్, హెచ్‌.నగేశ్‌లను కేబినెట్‌లోకి తీసుకోవటం గమనార్హం. ఈ మేరకు కొత్త మంత్రులచే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్‌ వీఆర్‌ వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఇద్దరు కొత్త మంత్రులు దేవుడి పేరుమీదుగా ప్రమాణం చేశారు. అయితే శాఖలు కేటాయించలేదు. ఆర్‌.శంకర్‌ హావేరి జిల్లా రాణిబెన్నూరు నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అదేవిధంగా హెచ్‌.నగేశ్‌ కోలార్‌ జిల్లా ముళబాగిలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా  గెలిచారు. కాగా సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్‌ కోటాలో ఇంకా ఒక బెర్తు ఖాళీగా ఉంది. మైత్రి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ 22, జేడీఎస్‌ 12 మంత్రి పదవులను పంచుకున్నాయి. ఇందులో భాగంగా జేడీఎస్‌ నుంచి 10, కాంగ్రెస్‌ 21 మంది మంత్రులు ఉన్నారు. తాజాగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం మొత్తం 33 మంది మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్‌ కోటా భర్తీ అయింది. కేవలం జేడీఎస్‌ నుంచి మాత్రమే ఒకరికి కేబినెట్‌ అవకాశం ఉంది. అయితే కేబినెట్‌ విస్తరణపై రెండు పార్టీల్లోనూ అసమ్మతి నెలకొంది. రెండు పార్టీల అధ్యక్షులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అంతేకాకుండా పలువురు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కేబినెట్‌ బెర్తు ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త సమస్య రానుంది.  కార్యక్రమానికి సీఎం హెచ్‌డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు. కాగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలే అయినా.. కేబినెట్‌ విస్తరణ రెండుసార్లు చేపట్టారు.

కాంగ్రెస్‌ బెర్తులు ఫుల్‌.. పార్టీలో అసమ్మతి
మైత్రి ఒప్పందంలో భాగంగా సంకీర్ణ ప్రభుత్వంలోని కేబినెట్‌లో కాంగ్రెస్‌ కోటాలోని 22 బెర్తులు భర్తీ అయ్యాయి. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే కేబినెట్‌ బెర్తును ఆశించిన చాలామంది సీనియర్‌ నేతలు అసమ్మతితో ఉన్నారు. కేబినెట్‌లో తమకు చోటు దక్కలేదని భావిం చి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు రామలింగారెడ్డి (బీటీఎం లేఅవుట్‌), రమేశ్‌ జార్కిహోళి (గోకాక్‌), చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, మహేశ్‌ కుమటళ్లి (అథణి), ప్రతాప్‌గౌడ పాటిల్‌ (మస్కి), నాగేంద్ర (బళ్లారి రూరల్‌) తదితరులు కేబినెట్‌ బెర్తు ఆశించి భంగపడ్డ వారి జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరందరు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.  

కాంగ్రెస్‌లో చేరిన మంత్రి ఆర్‌.శంకర్‌
హావేరి జిల్లా రాణిబెన్నూరు నుంచి గత 2018 విధానసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆర్‌.శంకర్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్‌లో చేరారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనంతరం కేబినెట్‌ విస్తరణలో ఆయనను తొలగించారు. కాగా మాజీ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆర్‌.శంకర్‌ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్య తరలివెళ్లి కేబినెట్‌ బెర్తు ఇస్తామని.. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి ముందు సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.  

బీఎం ఫరూక్‌కు జేడీఎస్‌ మొండిచెయ్యి
జేడీఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న హెచ్‌.విశ్వనాథ్‌కు కేబినెట్‌ బెర్త్‌ వస్తుందనే ప్రచారం సాగింది. అదేవిధంగా విధాన పరిషత్‌ సభ్యుడు బీఎం ఫరూక్‌కు జేడీఎస్‌ తరఫున ముస్లిం కోటాలో మంత్రి పదవి ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే జేడీఎస్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గానూ ఒక్క స్థానాన్ని స్వతంత్ర ఎమ్మెల్యేకు కట్టబెట్టారు. మరో స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఎవరికి ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జేడీఎస్‌ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన హెచ్‌.విశ్వనాథ్‌ (హుణసూరు ఎమ్మెల్యే) కేబినెట్‌ బెర్తు ఆశించారు. అయితే చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన బీజేపీలోకి చేరుతారనే వార్తలు వస్తున్నాయి.   

పార్టీ అధ్యక్షుల డుమ్మా
సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కేబినెట్‌ విస్తరణ కార్యక్రమానికి.. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు హాజరు కాలేదు. ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చనీయంగా మారింది. అయితే జేడీఎస్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ ఇటీవల రాజీనామా చేశారు. ఇంకా ఆమోదం తెలపలేదు. అదేవిధంగా దినేశ్‌ గుండూరావును కేపీసీసీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top