ప్రజలంతా నాకు రక్షణ కవచంలా ఉండాలి | Sakshi
Sakshi News home page

ప్రజలంతా నాకు రక్షణ కవచంలా ఉండాలి

Published Tue, Jun 5 2018 3:08 AM

CM Chandrababu comments on Pawan Kalyan - Sakshi

సాక్షి ప్రతినిధి, శృంగవరపుకోట/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నవారికి ఓటేయకండి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నవారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి’ అని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం, జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, ప్రజలంతా తనకు  రక్షణ కవచంలా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఎస్‌.కోటలో నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనను పొగిడిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. అసలు పవన్‌ తననెందుకు తిడుతున్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

అమ్మాయిలతో తిరగలేదు
‘నా చేతికి వాచీ, ఉంగరం లేదు.. జేబులో డబ్బులు లేవు.. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. మందుకొట్టలేదు.. సిగరెట్‌ కాల్చలేదు.. చెడు స్నేహాలు కూడా చేయలేదు. అలాంటి నన్ను తిడుతుంటే మీ కోసం భరిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతిని ఢిల్లీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలకు, ఏడుకొండలవాడికి ద్రోహం చేశారన్నారు. కర్ణాటకలో బీజేపీకి బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనడానికి బరితెగించి కోర్టు ఆదేశాలతో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. 

గాలివాన బీభత్సం
ఎస్‌.కోటలో చంద్రబాబు నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభలో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భారీ గాలివాన రావడంతో టెంట్లు కూలిపోయి బారికేడ్లు తిరగబడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సభకు అంతరాయం ఏర్పడింది. తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించడంతో చంద్రబాబు సభనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు, యువకులు మండుతున్న ఎండలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నానా ఇబ్బందులు పడ్డారు. అనంతరం భారీ వర్షంలో తడిసి ముద్దవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఎంపీ అశోక్‌గజపతిరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శోభా హైమావతి, జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

విశాఖ విమానాశ్రయంలో సోమవారం రాత్రి గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయాలను రిమోట్‌ ద్వారా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందర్నీ కలుపుకుని పోతున్నానన్నారు. కాగా, కళింగ వైశ్యులకు ఓబీసీ రిజర్వేషన్‌ ప్రభుత్వం ఇచ్చినా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కళింగ వైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా ఉమామహేశ్వరరావు ఈ మేరకు విశాఖలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ సృజన, పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్, జాయింట్‌ సీపీ రవికుమార్‌ మూర్తి, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలంభవానీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement