దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని

Chintamaneni Prabhakar Controversial Comments On Dalits - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : దళితుల పట్ల టీడీపీ వివక్షాపూరిత ధోరణి మరోసారి బయటపడింది. మొదటి నుంచీ వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రంగా అవమానించారు. దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...‘రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్‌ కాస్ట్‌కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా’ అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది. (మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని)

దీంతో చింతమనేనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ప్రజాప్రతినిధి కాదని.. ప్రజా గూండా అని, ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలకింద కేసులు పెడుతామని ప్రకటించాయి. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ నేత మోషేన్‌రాజు తెలిపారు. చింతమనేని అనుచిత వ్యాఖ్యలు దళితులను మాత్రమే అవమాన పరచలేదని, రాజ్యాంగాన్ని కూడా కించపరిచేవిగా ఉన్నాయని ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యుడు బత్తుల భీమారావు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే మాట్లాడిన ప్రభాకర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జాతి ఆదరాభిమానాలతో అధికారం చెలాయిస్తున్న నాయకులకు గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న దళిత నాయకులు చింతమనేని వ్యాఖ్యలను ఖండించకపోవడం విచారకరమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top