మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని

TDP Leaders Rude Behavior With Govt Beneficiaries - Sakshi

సహనం కోల్పోతున్న తెలుగు తమ్ముళ్లు

పథకాల లబ్ధిదారులపై బూతుపురాణం

నేతల మాటతీరుతో విస్తుపోతున్న ప్రజలు

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీడీపీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో జనాలపై నోరుపారేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అంటూ దుర్భాషలాడుతున్నారు. పథకాల కింద ప్రజలకు ఇచ్చే డబ్బును తమ సొంత జేబుల నుంచి ఇస్తున్నట్లు పచ్చనేతలు ఫీలైపోతున్నారు. వారం రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద బూతు పురాణం విప్పగా.. నిన్న ప్రభుత్వ విప్‌, వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓ వృద్ధుడైన పింఛన్‌ దారుడిపై చిందులు తొక్కారు. గతంలో చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ కూడా టీడీపీకి ఓటు వేయకపోతే.. తామేసిన రోడ్లపై నడవద్దని, తామిచ్చే ఫించన్లు, రేషన్‌ తీసుకోవద్దని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

‘ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుంటున్నావ్‌.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది. మీ అమ్మ మూడు వేలు తీసుకుంటుంది. రుణమాఫీ వస్తే అది దొబ్బావ్‌.. ఇవన్నీ దొబ్బి మళ్లీ ఓటేయ్యవా’ అని ప్రజలను నిలదీయాలంటూ తన అనుచరుల వద్ద అచ్చెన్నాయుడు బూతుపురాణం విప్పారు. ఈ వ్యాఖ్యలతో అవాక్కైన ప్రజలు మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇస్తున్నారా.. మమ్మల్ని అవమానించేలా ఎలా మాట్లాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్‌ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిపై ‘నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని విరుచుకుపడటం హాట్‌టాపిక్‌ అయింది. అంటే ప్రభుత్వ పథకాలు కేవలం టీడీపీ వారికేనా.. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు వర్తించవా? అంటూ ఆ వృద్ధుడి కొడుకులు నిలదీయడంతో చింతమనేని మరింత దౌర్జన్యానికి దిగారు. 

ప్రమాణం చేయకపోతే చెక్కు లేదు..
సరిగ్గా ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల కోసం పసుపు-కుంకుమ చెక్కులంటూ కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబునాయుడు తెరలేపగా..  ఆయన అనుచరవర్గం ఈ చెక్కులను అడ్డుపెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీకి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తేనే చెక్కులిస్తామని హుకుం జారీ చేస్తోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయడానికి నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం, ప్రమాణం చేయకపోతే చెక్కులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top