ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా

Chandrababu Wants To Remove NTR Name In NTR Vaidya Bharosa Scheme - Sakshi

ఎన్టీఆర్‌పై తీవ్ర అసభ్య పదజాలంతో చంద్రబాబు తిట్ల దండకం

తోకపత్రిక రాధాకృష్ణతో సంభాషణ 

మనపత్రికల్లో ఊదరగొడదాం..    ఆ పేరు మర్చిపోయేలా చేద్దామన్న రాధాకృష్ణ 

అసత్యాలను వాస్తవాలుగా  మీడియా ద్వారా ఎలా ప్రచారం చేయాలో చర్చ

ఎన్టీఆర్‌కు ద్రోహం తలపెడుతూ అడ్డంగా దొరికిన చంద్రబాబు

ప్రజలను లైవ్‌ పేరుతో ఎలా మోసం చేయాలో ప్లాన్‌ 

బట్టబయలైన రాధాకృష్ణ – చంద్రబాబుల బంధం 

‘సాక్షి’ వద్ద సంచలన వీడియో 

మండిపడుతున్న ఎన్టీఆర్‌ అభిమానులు

సాక్షి, అమరావతి :  తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎన్టీఆర్‌కు  వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీని పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న తోకపత్రిక ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్‌ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య భరోసా)ను పేరు మార్చడంతోపాటు ఆరు నెలల తర్వాత పూర్తిగా దీనిని ఎత్తి వేయాలని వారు  పథకం వేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య ఈ కుట్రకు సంబంధించి జరిగిన సంభాషణల వీడియో ‘సాక్షి’కి లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  టీవీ లైవ్‌ ప్రోగాంకు ముందు వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు వీరి కుట్రను బట్టబయలు చేశాయి. వారు తలచుకుంటే ఎంత విష ప్రచారమైనా చేయగలరని, దేనినైనా తారుమారు చేసే కుట్రలకు బీజాలు వేస్తారని మరోమారు రూఢీ అయింది. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్‌ వైద్య భరోసా అనే పేరు మార్చిన విషయం విదితమే. ఇందులో ఎన్టీఆర్‌ పేరును తొలగించే విషయం రాధాకృష్ణ  చంద్రబాబు మధ్య చర్చకు వచ్చింది. పేరు తొలగిద్దామనగానే తీసేయండి అని రాధాకృష్ణ సలహా ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది... 

వాడి పనైపోయింది
చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం.... 
రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్‌ వర్క్‌ ఎవరూ చేయలేదు. 
చంద్రబాబు : దానిని మిస్‌ యూజ్‌ చేశారు.  
రాధాకృష్ణ : ఫస్ట్‌ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్‌ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్‌ లైక్స్‌ రావాలి. 
రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్‌. 
చంద్రబాబు : వ్యూయర్‌షిప్‌లో మనది ఎంత? 
రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం 
టెక్నికల్‌ టీమ్‌: (చంద్రబాబుతో) వైజాగ్‌ ఇంకో సిటీని కలిపాం సార్‌ 
చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే  లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా?  
రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు. 
చంద్రబాబు :   నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్‌ చేయి. 
రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా. 
వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్‌. 
రాధాకృష్ణ :ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు? 
చంద్రబాబు :  వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా.. 
రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్‌ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.  
చంద్రబాబు :  మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) 
రాధాకృష్ణ : ఆ ఓకే.  
చంద్రబాబు :  ఎన్టీఆర్‌... పేరు మార్చాలి.  
రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్‌ చేద్దాం.
ఈలోగా టెక్నికల్‌ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి.  వైజాగ్‌లో ఏమి పెట్టారు.  వైజాగ్‌లో ఎల్‌ఈడీ...తదితర అంశాలున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top