చంద్రబాబు సర్కార్‌ కొత్త నాటకం

Chandrababu Naidu Govt Election Drama - Sakshi

ఉద్యోగులను తొలగించి.. ఆపై తాయిలం!

అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ మండల, గ్రామ కోఆర్డినేటర్లను ఏడాది క్రితం తొలగింపు

ఎన్నికల ముందు వారికి శిక్షణ పేరుతో జీవో విడుదల    

సాక్షి, నెల్లూరు: విధుల నుంచి తప్పించిన చిరుద్యోగులను ఎన్నికల ముందు ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన డ్రామాలు విస్మయ పరుస్తోంది. గతేడాది సాక్షర భారత్‌ మండల, గ్రామ కోఆర్డినేటర్ల ఉద్యోగాలు ఊడగొట్టి వారి జీవితాలను రోడ్డు పాల్జేసిన ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో వారిని ఆకట్టుకొనేందుకు ఉద్యోగాల్లేని వారికి శిక్షణ ఇస్తున్నట్లు  మెమో ఒకటి విడుదల చేసింది. ఒకవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా తొలివిడతగా సాక్షర భారత్‌ ప్రొగ్రామ్‌ మండల కోఆర్డినేటర్లకు వారం పాటు శిక్షణ ఇవ్వాలంటూ వయోజన విద్యా శాఖ మెమో నంబర్‌ 600ను విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పది జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతçపురం, కర్నూలు జిల్లాల్లోని 502 మండలాల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు 502 కోఆర్డినేటర్లతో పాటు దాదాపు 20 వేల మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేసేవారు. ఆ చిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం గతేడాది మార్చి 31 నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ  సర్క్యులర్‌ జారీ చేసింది. అప్పట్లో ఆ ఉద్యోగులు ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానంటూ ఆయన వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు  ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసింది. విధుల్లో నుంచి తొలగించిన మండల కో ఆర్డినేటర్లకు శిక్షణ ఇవ్వాలంటూ గత నెల 3న వయోజన విద్యా శాఖ ద్వారా మెమో జారీ చేశారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన..
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా పాలనా పరమైన ఉత్తర్వులు విడుదల చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే కోడ్‌ను ఉల్లంఘిస్తూ వయోజన విద్యా శాఖ శిక్షణ ఇవ్వాలని మెమో జారీ చేయడం చర్చనీయాంశమైంది. శిక్షణ కోసం పది జిల్లాలోని మండల కోఆర్డినేటర్లకు టీఏ, డీఏ ద్వారా ప్రతిరోజు రూ. 200 చొప్పున మెమోలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు వివాదస్పద మెమో జారీచేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top