చచ్చినా సమస్య తీరట్లేదు.. అన్నదాతల ఆత్మఘోష | Farmer Suicide in Chandrababu Naidu Government: Andhra pradesh | Sakshi
Sakshi News home page

చచ్చినా సమస్య తీరట్లేదు.. అన్నదాతల ఆత్మఘోష

Mar 18 2026 5:20 AM | Updated on Mar 18 2026 5:22 AM

Farmer Suicide in Chandrababu Naidu Government: Andhra pradesh

చంద్రబాబు జమానాలో ఆరుగాలం శ్రమించిన రైతులకు అడుగడుగునా కష్టాలే  

రైతు స్వరాజ్య వేదిక సంఘీభావ సదస్సులో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం

22 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వని వైనం 

చాలా చోట్ల కనీసం ఆత్మహత్యలను నమోదు చేయని దుస్థితి 

రోడ్డున పడుతున్న రైతు కుటుంబాలు 

కనీసం వితంతు పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు 

అప్పులోళ్ల వేధింపులు తాళలేక పోతున్నామని బాధితుల ఆవేదన 

సామాజిక బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం 

ఆర్‌డీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో 17 మంది రైతు కుటుంబాలకు సాయం

సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడ తూర్పు): ధాన్యపు సిరులతో గాదెలు నిండాల్సిన ఇంట్లో దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్దయ కారణంగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలనుæ ఆదుకోవడంతో విఫలమవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రెండేళ్లుగా పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యలను కనీసం నమోదు చేసేందుకు కూడా ఈ దయలేని ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. ఆదుకునే ఆపన్న హస్తం లేకపోవడంతో ఇంట్లో ఒక పూట తింటే రెండో పూట పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఆ రైతు కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి. 

పిల్లలను అర్ధంతరంగా చదువులు మాన్పించి, మూకుమ్మడిగా కూలి పనులకు పోవాల్సిన ఆగత్యం దాపురించింది. కనీసం వైద్యం కూడా చేయించుకోలేని దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నారు. రెండేళ్లుగా పరిహారం కోసం అధికారుల చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. భర్త చనిపోతే ఇచ్చే వితంతు పింఛన్‌లకు కూడా అన్నదాతల భార్యలు నోచుకోలేకపోతున్నారు. రూ.వేల కోట్లు ఎగనామం పెట్టే బడా పారిశ్రామిక వేత్తలకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అంటూ వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్న వేళ.. రైతన్నల అప్పులను మాఫీ కాదు కదా, కనీసం వాయిదా వేయించలేక పోతోంది.

భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండేళ్లు గడిచినా పైసా విదిల్చిన పాపాన పోలేదు. కనీసం పంటల బీమా పరిహారం కాదు కదా.. పెట్టుబడి రాయితీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 2024–2025లో 150 మంది.. 2025–2026లో ఇప్పటి వరకు ఏకంగా 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించించిన సంఖ్య ఇది. రికార్డుల్లోకి ఎక్కని మృతులు ఇంకెంత మంది ఉన్నారో! బాధితులెవ్వరికీ ఈ ప్రభుత్వం పైసా పరిహారం ఇవ్వలేదు. 

స్వచ్ఛంద సంస్థలను చూసి సర్కారు సిగ్గు పడాలి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ (ఆర్‌డీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాల సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నాయి. ఆర్‌డీఎస్‌ఎస్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ.8.50 లక్షల ఆర్థిక సాయం అందించారు.

రైతులను ఎంతో కొంత ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయే తప్ప ప్రభుత్వంలో మాత్రం చలనం కన్పించడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంఘీభావ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యుల ఆక్రందనలు అక్కడున్న వారందరి హృదయాలను కదిలించాయి. స్వచ్ఛంద సంస్థలను చూసి ప్రభుత్వం కొంచెమైనా సిగ్గు తెచ్చుకుంటే మేలని సమావేశానికి హాజరైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.

ఈమె పేరు భూమా సునీత. నంద్యాల జిల్లా రైతు నగరానికి చెందిన ఈమె భర్త సురేష్‌ రెడ్డి.. ఏడెకరాలు కౌలుకు తీసుకొని రూ.4 లక్షలు అప్పులు చేసి వరి పంట వేశాడు. వర్షాల్లేక పోవడంతో పాటు తెగుళ్ల బారిన పడడంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేసిన అప్పులు తీర్చే దారిలేక 2024 అక్టోబర్‌ 10న ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మట్టి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో ఇరుగు పొరుగు వారు తలో చేయి వేసి అంత్యక్రియలు చేశారు. 

తండ్రి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ‘భూ యజమానితో అగ్రిమెంట్‌ కూడా ఉంది. అయినా మా ఆయనకు కౌలు కార్డు ఇవ్వలేదు. సాయం చేయమని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. మంత్రి ఎన్‌ ఎండీ ఫరూక్‌ను కలిసి వేడుకుంటే ‘కౌలు కార్డు లేదు.. ఏమీ చేయలేం వెళ్లిపోండి అని తిప్పి పంపేశారు. వితంతు పింఛన్‌ ఇవ్వమని వేడుకున్నా పట్టించుకోలేదు. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. అత్త హోటల్‌ పనికి పోతూ మమ్మల్ని చూసుకుంటోంది’ అని సునీత కన్నీరు మున్నీరవుతోంది.

ఈమె పేరు చింతకుంట సుధారాణి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామం. ఈమె భర్త సుందరరాజు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వర్షాభావంతో పంట దెబ్బ తినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పురుగు మందు తాగి 2025 జనవరి 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాకు నలుగురు ఆడ పిల్లలు. భర్త చనిపోయే నాటికి గర్భిణిగా ఉన్నాను.

వ్యవసాయ అవసరాల కోసం నా భర్త చేసిన రూ.8 లక్షల అప్పుతో పాటు డ్వాక్రాలో మరో రూ.50 వేల అప్పు ఉంది. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్‌ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కనీసం నా భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నమోదు చేయలేదు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య దగ్గరకు వెళ్లి కనీసం పింఛన్‌ ఇప్పించాలని వేడుకున్నా వినిపించుకోలేదు. మా అత్త కూలి పనికి వెళుతూ మమ్మల్ని చూసుకుంటోంది. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ అంటూ సుధారాణి కన్నీటి పర్యంతమైంది.

పిల్లాడికి వైద్యం చేయించలేకపోతున్నా 
మా ఆయన సుదర్శన్‌. ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు. బాబుకు గుండె సమస్య ఉంది. బోల్డెంత ఖర్చవుతుందన్నారు. వ్యవసాయంతో పాటు బాబుకి వైద్యం కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు తీర్చేదారి లేక గతేడాది అక్టోబర్‌ 18న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త, మామలు మా వల్ల కాదని ఇంటి నుంచి పంపించేశారు. అమ్మ వాళ్ల దగ్గరే ఉంటున్నా. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మీకు కౌలు కార్డు లేదు.. పరిహారం రాదు.. అని చెబుతున్నారు. కనీసం పింఛన్‌ అయినా ఇవ్వమని వేడుకున్నా పట్టించుకోవడం లేదు. ఓ పక్క అప్పులోళ్లు రోజూ ఇంటికి వస్తున్నారు. మరో పక్క బాబుకు వైద్యం ఏ విధంగా చేయించుకోవాలో అర్థం కావడం లేదు. ఎలా బతకాలో కూడా తెలియడం లేదు.    – మైలుగాని మమతమ్మ, ఇల్లూరు, గార్లెదిన్నె మండలం, అనంతపురం జిల్లా

ఎన్ని అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు 
నా భర్త సుర్ల బెన్నయ్య మూడెకరాల్లో పత్తి, టమాటా, పచ్చి మిరప సాగు చేశాడు. వ్యవసాయం కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. అప్పులోళ్లు ఇంటికొచ్చి రోజూ వేధింపులకు గురిచేయడంతో ఏం చేయాలో తోచక కిందటేడాది ఏప్రిల్‌ 23వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపను అప్పు చేసి డిగ్రీ చదివిస్తున్నా. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు. ఏం చేయాలో ఎలా బతకాలో బోధ పడడం లేదు.    – సుర్ల అమ్మాజి, పాములవాక, కోటఉరట్ల మండలం, అనకాపల్లి జిల్లా

పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు 
మా ఆయన పెదరంగన్న ఏడెకరాలు కౌలుకు చేసేవాడు. సాగు కోసం రూ.8 లక్షలు అప్పులు చేశాడు. పంటలు దెబ్బ తినడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక గతేడాది మే 20న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి దివ్యాంగురాలు. కొడుకు పనికి వెళ్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా పైసా పరిహారం రాలేదు. కనీసం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు.    – చాకలి సునీత, మునగాల, గూడురు మండలం, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement