అబద్ధాల జాతర.. కొలువులకు పాతర | Chandrababu govt Fraud with unemployed youth in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అబద్ధాల జాతర.. కొలువులకు పాతర

Mar 19 2026 4:44 AM | Updated on Mar 19 2026 4:44 AM

Chandrababu govt Fraud with unemployed youth in Andhra Pradesh

పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు 

22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద రూ.13,200 కోట్లు ఎగవేత  

అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం 

ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి 

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు అండ్‌ కో హామీ 

ఈ మేరకు సంతకాలు చేసి మరీ ఇంటింటా బాండ్లు పంపిణీ చేసిన నేతలు  

మేనిఫెస్టోలోనూ పెట్టి యువతకు గాలం.. 

తీరా గద్దెనెక్కాక నోటిఫికేషన్ల ఊసే లేదు 

ఏటా 75 వేల మంది ఉద్యోగ అర్హత కోల్పోతున్నా పట్టించుకోని దుస్థితి

10 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్‌ కేలండర్‌ అంటూ తాజాగా కొత్త రాగం  

2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 6,31,310 ఉద్యోగాలు  

ఆరు నెలలు తిరక్కుండానే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు 

2.66 లక్షల మంది వలంటీర్ల నియామకం

ఆప్కాస్‌ ద్వారా 96 వేల ఉద్యోగాలు 

ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ 

ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లతో వివాద రహితంగా పోస్టుల భర్తీ  

ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 27 శాతం ఐఆర్‌.. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, మున్సిపల్‌ కార్మీకులకు జీతాల పెంపు  

ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో. డేటు టైము రాసుకో. జగన్‌లాగా పారిపోయే బ్యాచ్‌ కాదు నేను.
– 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో నారా లోకేశ్‌

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2025 జనవరి ఫస్ట్‌న జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్స్‌.. ఎప్పుడు ఇంటర్వూలు.. ఎప్పుడు ఆఫర్‌ లెటర్లు ఇస్తాం అన్నది చాలా స్పష్టంగా చెబుతాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ మేమిస్తాం.
– 2024 ఏప్రిల్‌లో ఉరవకొండలో లోకేశ్‌

ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతికి లింక్‌ చేస్తాం. కాబట్టి సూపర్‌–6 హామీలు అయిపోయాయి. గుర్తు పెట్టుకోండి.. ఇంక ఎవడైనా సూపర్‌–6 అని మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటిగాదు.
– 2025 జూన్‌ 12న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు

ఈ రోజు వరకు 18 నెలల కాలంలో నేను దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను. ఈ మొత్తం 23 లక్షల కోట్ల ఉద్యోగాలను తెచ్చింది.’ 
– జనవరి 26న ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సీఎం చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా­యి. ఖాళీలను మరో మూడు నెలల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 
– మార్చి 4న శాసన మండలిలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌

సీన్‌ కట్‌ చేస్తే..
2024 ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ మేరకు చంద్రబాబు అండ్‌ కో సంతకాలు చేసి మరీ ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అదే విషయాన్ని వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతోంది. ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.  ఈ 22 నెలల్లో నిరుద్యోగులకు రూ.13,200  కోట్లు ఎగ్గొట్టారు.

మునుపటికొకడు పంచ పాండవులంటే మంచం కోళ్లులాగా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించాడట. ఉద్యోగాల కల్పన విషయంలో చంద్రబాబు సర్కారు తీరు సరిగ్గా అలానే ఉంది. ఉద్యోగాలు పొందిన వారి గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఒక్కో చోట ఒక్కో రకంగా నోటికొచ్చినట్లు చెబుతూ పబ్బం గడుపుకుంటుండటం నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.

ఎన్నికలకు ముందు ఇంటింటికీ బాండ్లు
‘మేం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంతకాలు చేసి మరీ ఎన్నికలకు ముందు ఇంటింటికీ బాండ్లు పంచారు. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్‌–6లో సైతం ప్రథమంగా పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ కూడా ప్రకటిస్తామన్నారు.


⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 2025 జూన్‌లో సూపర్‌–6 హామీలన్నీ అమలు చేసేశామని ప్రకటించేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గడిచిన 22 నెలలకు ఒక్కో నిరుద్యోగ అభ్యర్థికి రూ.66 వేల చొప్పున రాష్ట్రంలో 20 లక్షల మందికి రూ.13,200 కోట్లు బకాయి పడ్డారు. ఇలా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే నాలుక మడత పెట్టేశారంటే సామాన్య ప్రజలతో పాటు నిరుద్యోగులకు ఎంత దగా చేశారో తెలుస్తోంది. 

⇒ ప్రస్తుతం ఈ మాటలన్నీ కలగానే మిగిలిపోయాయి. 20 లక్షల మంది నిరుద్యోగులను దగా చేశారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. చిన్నా చితక కంపెనీల్లో వాచ్‌మెన్‌ ఉద్యోగాలు పొందిన వారిని చూపిస్తూ నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. 

⇒ ఇటీవల శాసనసభలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ నిరుద్యోగ భృతిపై సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి 
చర్యలు తీసుకోలేదన్నారు.

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు యువకులు, నిరుద్యోగులకు చంద్రబాబు అండ్‌ కో ఇచ్చిన హామీలు ఆవిరైపోయాయి. నాడు నిరుద్యోగులకు అరచేతిలో ఉద్యోగాలు చూపెట్టిన ‘ముఖ్య’ నాయకులు ఇప్పుడు కేలండర్‌ అంటే కాదంటున్నారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ కేలండర్‌ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. 2025, 2026 జనవరి నెలలు దాటిపోయినా కేలండర్‌ కాదు కదా.. కనీసం కొత్త నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదు. ఓ పక్క ఏటా దాదాపు 75 వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వయో పరిమితి దాటిపోయి, అర్హత కోల్పోతుంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్స్, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించడంపై మీన మేషాలు లెక్కిస్తోంది. ఏఈఈ, ఏఈ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా, 20 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిని సైతం ఎగ్గొట్టింది. జాబ్‌ కేలండర్‌పై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగి ఆందోళనలు చేపడితే, వారిపై కేసులు బనాయించి అరెస్టులకు తెగబడుతోంది. జాబ్‌ కేలండర్‌ ఇవ్వకుండా ‘ఉగాదికి 10 వేల ఉద్యోగా’లంటూ లీకులిచ్చి నెట్టుకొస్తోంది.

10 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు గల్లంతు
అధికారంలోకి రాగానే ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ ఇస్తామన్న చంద్రబాబు హామీ అటకెక్కింది. గత ప్రభుత్వంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించి గ్రూప్‌–1, 2 తప్ప ఇతర ఉద్యోగాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ భవితవ్యం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత 22 నెలలుగా జాబ్‌ కేలండర్‌ మాట అటుంచి, ఏపీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంగా మార్చేశారు. ఏపీపీఎస్సీ ఓటీపీఆర్‌ (వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌)లో నమోదైన గ్రాడ్యుయేట్లు ఏటా 75 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ అర్హత వయసు దాటిపోయి, అవకాశాలు కోల్పోతుంటే కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 

20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ శాసన సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఈనాడు కథనం 

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటే పరీక్షలు ఎప్పుడు జరిగేదీ షెడ్యూల్‌ ప్రకటించి, దాని ప్రకారమే పరీక్షల నిర్వహణ, పోస్టులు భర్తీ చేసేవారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి దాపురించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి, 2025 డిసెంబర్‌ నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ ఇటీవల గ్రూప్‌–2, గ్రూప్‌–1 నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. కానీ డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ఫలితాలు ఇంకా చీకటిలోనే ఉండిపోయాయి. 

లీకులతో కాలయాపన 
రెండేళ్లుగా జాబ్‌ కేలండర్‌పై తాత్సారం చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాలపై లీకులిస్తూ కాలయాపన చేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా శాఖల్లో పోస్టుల ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే గతేడాది 150 గ్రూప్‌–1 పోస్టులు ఉన్నట్టు ప్రకటించి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అంతేగాక, ప్రభుత్వం వద్ద నాలుగు శాఖల్లో 1125 ఏఈఈ, ఏఈ ఖాళీలున్నా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తాజాగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉగాదికి జాబ్‌ కేలండర్‌ అంటూ కొత్త ప్రచారం తెరపైకి తెచ్చి నిరుద్యోగులను మరోసారి వంచించే పనికి పూనుకుంది. 


మోసం చేయడం బాబుకు కొత్త కాదు
చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమి కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆపై నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో 2019 ఎన్నికలకు ముందు ‘యువనేస్తం’ పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, సవాలక్ష ఆంక్షలు విధించి, నిరుద్యోగ భృతి పొందే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగులను భృతికి అర్హులుగా తేల్చగా.. తరువాత 10 లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ 1.62 లక్షల మందికే ఇస్తామన్నారు. దీనికి ఈకేవైసీ లింక్‌ పెట్టి అతి కొద్ది మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. ఈసారి 20 నెలల్లో ఒక్కరికి కూడా భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో ఉద్యోగ జాతర.. ఉద్యోగులకు పండుగ
దేశ చరిత్రలో ఉద్యోగాల కల్పనలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిపింది. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపి 6,31,310 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.

⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షె­డ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల నియామకం చేపట్టారు.

⇒ భారీ మధ్య తరహా పరిశ్రమల్లో 1.02 లక్షల మందికి, ఎంఎస్‌ఎంఈ రంగంలో 32,79,970 మందికి ఉపాధి కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిపింది.

⇒ ఆరు నెలలు తిరక్కుండానే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. ఆప్కాస్‌ ద్వారా 96 వేల ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు.

⇒ 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది.  

⇒ భారీ మధ్య తరహా పరిశ్రమల్లో 1.02 లక్షల మందికి, ఎంఎస్‌ఎంఈ రంగంలో 32,79,970 మందికి ఉపాధి కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిపింది.

⇒ అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, రిసోర్స్‌పర్సన్‌లు, మున్సిపల్‌ కార్మికులకు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా వీరి జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి మూడింతలు బడ్జెట్‌ పెరిగినా లెక్క చేయకుండా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. వీటన్నింటిని బట్టి ఉద్యోగులకు మంచి జరిగిందీ అంటే అది గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనేనని ఇట్టే స్పష్టమవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement