నాకు ఓటేయకపోతే ఇబ్బందుల్లో పడతారు | Sakshi
Sakshi News home page

నాకు ఓటేయకపోతే ఇబ్బందుల్లో పడతారు

Published Wed, Mar 27 2019 5:46 AM

Chandrababu Controversial Comments At Kurnool Public Meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ‘నాకు ఓటేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. భవిష్యత్‌ అంధకారం అవుతుంది. వైఎస్సార్‌సీపీకి ఒక్క ఓటు కూడా వేయకుండా అన్ని ఓట్లూ టీడీపీకే వేయాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కర్నూలు నగరంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనంలేక రోడ్‌షోలు వెలవెలబోయాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు రోజూ మాట్లాడుతున్న తరహాలోనే ప్రజలను బెదిరించేలా ప్రసంగించారు. కేసీఆర్, మోదీ బూచి చూపడంతోపాటు ‘కాపీ పథకాల’నూ వల్లెవేశారు. ఆయన ప్రసంగాన్ని విన్న ప్రజలు ఇదెక్కడి చోద్యమంటూ మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో టీఆర్‌ఎస్‌ మద్దతు అవసరంలేదంటూ నంద్యాల సభలో వ్యాఖ్యానించారు. అదేమైనా జాతీయ పార్టీనా అని ప్రశ్నించారు. ఇవ్వాల్సింది బీజేపీ, కాంగ్రెస్‌లేనని, ఇందులో బీజేపీ ఇవ్వకుండా మోసం చేసిందని, సోనియా, రాహుల్‌గాంధీ ఇస్తామని చెప్పడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీ ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని, ఈ యుద్ధంలో వారికి భయపడే ప్రసక్తేలేదన్నారు. ‘తీవ్రవాదులతో పోరాడా.. రౌడీలను వెళ్లగొట్టా.. బాంబులకు భయపడని నేను వారికి భయపడతానా? అయినా మీరంతా నాకు అండగా నిలవాల’ని కోరడంతో ప్రజలు విస్తుపోయారు. అలాగే, అన్నిచోట్లా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘మీకు ఆళ్లగడ్డ పౌరుషం లేదా? నంద్యాల పౌరుషం లేదా? కర్నూలు పౌరుషం లేదా.. పిడికిలి బిగించాలి’.. అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, గతంలో వైఎస్‌ జగన్‌ నంద్యాలను ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు యథాప్రకారం దీనినీ కాపీ కొట్టి నంద్యాలను జిల్లా చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. మోదీ ఏకపక్ష నిర్ణయాలు, హిందుత్వ పేరుతో ఆయన ఇతర మతాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నామన్నారు. ముస్లిం మహిళల రక్షణ కోసం తలాక్‌ బిల్లును తెచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం.. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని ప్రశ్నించారు. కాగా, ఫరూక్‌ అబ్దుల్లా ప్రసంగం ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా.. మోదీని విమర్శించడానికే పరిమితమైన ఆయన ఎక్కడా టీడీపీకి ఓటు వేయాలని కోరకపోవడం గమనార్హం.

కొండారెడ్డి బురుజు సాక్షిగా అబద్ధాలు
కర్నూలు సభలో సీఎం మాట్లాడుతూ.. అమరావతి, కడపతోపాటు కరూŠన్‌ల్‌లో హజ్‌హౌస్‌ కట్టించామని తెలిపారు. అయితే, కొండారెడ్డి బురుజు సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని చూసి సభకు హాజరైన వారు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి గత ఎన్నికల ముందు కర్నూలులో హజ్‌హౌస్‌ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా దీనిని నిర్మించలేదు. ఇప్పుడు ఆ శిలాఫలకం వెక్కిరిస్తూనే ఉంది. అయినప్పటికీ హజ్‌హౌస్‌ను నిర్మించామని చంద్రబాబు ప్రకటించడంతో ప్రజలు అవాక్కయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement