మద్యం ధరలు ఎందుకు పెంచారు?

Chandrababu Comments On Alcohol price hike - Sakshi

మీకు నచ్చిన బ్రాందీ అమ్ముతారా..?

నీటి ప్రాజెక్టుల వద్దే పడుకొని వాటిని పూర్తి చేశా

ఖబడ్దార్‌.. పోలీసుల గుండెల్లో నిద్రపోతా..

కుప్పం ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు  

సాక్షి, తిరుపతి: ‘నేను అడుగుతున్నా.. మద్యం ధరలు ఎందుకు పెంచారు.? మీకు నచ్చిన బ్రాందీని షాపుల్లో అమ్ముతారా?’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం కుప్పంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీసులు, ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. కృష్ణ, గోదావరి కలిపింది తానేనన్నారు. హంద్రీ–నీవా, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పకువచ్చారు. కుప్పం, పులివెందులకు కూడా నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నానన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పానికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టి, అక్కడే పడుకుని పూర్తిచేశానని చెప్పారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో అందరికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇచ్చానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, విమర్శించే స్వేచ్ఛ ఉందన్నారు. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసినా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌నెట్‌ తమ హక్కు అని చెప్పారు. పోలీసులు, సాక్షి మీడియా ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారంటూ హెచ్చరించారు. ఖబడ్దార్‌.. మీ గుండెల్లో నిద్రపోతానంటూ పోలీసులనుద్ధేశించి వ్యాఖ్యానించారు. నేను కన్నెర్ర చేస్తే మీరెవరూ తట్టుకోలేరని బెదిరింపులు చేశారు.

విచారణలు చేస్తే.. పెట్టుబడిదారులు రారు
రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం.. తొమ్మిది నెలలు ఏం చేసిందని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏం జరిగిందో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఇలా ఎంక్వయిరీలు వేస్తే రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరూ రారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహించలేదని చెప్పుకువచ్చారు. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉందన్నారు. అమరావతిలో మహిళపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేశారు. నాడు స్వాతంత్య్రం కోసం గాంధీజీ పోరాడారని, నేడు తాను కార్యకర్తల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల గురించి ప్రస్తావించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top