
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై కాంగ్రెస్ తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలను గేట్ల వద్దే అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రైతు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మాజీమంత్రి డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉదయమే గాంధీభవన్‌కు చేరుకున్నారు.
కాంగ్రెస్ జెండాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి పాదయాత్రగా బయల్దేరారు. అయితే గాంధీభవన్ ప్రధాన గేటు దాటుతున్న సమయంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్తమ్, మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి, కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ మహిళా నేతలు నాంపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, నేరెళ్ల శారద, బండ కార్తీక రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు రాస్తారోకో చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచౌదరి ట్యాంక్‌బండ్ నుంచి పాదయాత్రగా వచ్చి నేరుగా అసెంబ్లీ వద్దకు చేరుకుని లోపలికి వెళ్లడానికి యత్నించారు. అరెస్టు చేయడానికి రావడంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.
ఎమ్మెల్యేల బైఠాయింపు
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభ, శాసన మండలి పక్ష నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు.
భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, పొంగులేటి, జి.చిన్నారెడ్డి, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. అరెస్టులు అప్రజాస్వామికమంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఇంత నిరంకుశత్వమా?
నిజాంను మించిన కర్కశత్వం: కాంగ్రెస్ మండిపాటు
రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినందుకు అరెస్టులు, నిర్బంధాలు విధించడం అప్రజాస్వామికమని ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం వారు మాట్లాడారు.
‘‘రైతులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరిచింది. వాటిని అమలు చేయాలని అడిగినందుకు అరెస్టులు చేయడం ఏం న్యాయం? రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదు. సభలో టీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. కేసీఆర్ తీరు నిరంకుశత్వానికి, రాచరిక పాలనకు అద్దం పడుతోంది’’అని విమర్శించారు. నిజాంను మించిన కర్కశత్వం చూపిస్తున్నారని జానారెడ్డి, ఉత్తమ్ మండిపడ్డారు.
నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పాలన కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అంటూ ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులను తమ రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ఎకరానికి నాలుగు వేలు ఇస్తామంటున్న సీఎం వెంటనే దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు పోలీసు స్టేషన్లలో ఎందుకు ఉంటున్నారో ప్రభుత్వం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను చర్చించకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికే అయితే 50 రోజులు నడిచినా, 500 రోజులు నడిచినా సభకు అర్థం లేదన్నారు. అలాగైతే టీఆర్‌ఎస్ కార్యాలయంలో అసెంబ్లీని నడుపుకోవచ్చునన్నారు. ప్రతిపక్ష పార్టీలను జైళ్లలో పెట్టి బీఏసీ సమావేశం పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమావేశాలు ఇంత దారుణంగా లేవన్నారు. రైతులకు బోనస్ ఇవ్వని సీఎం... కేసీఆర్ ఒక్కరేనని షబ్బీర్ అలీ విమర్శించారు.