
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: దేశంలో, రాష్ట్రంలో మానవత్వాలు లేని ప్రభుత్వాలు అధికారంలో ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని విభజన హామీల అమలు సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటూ ఆర్‌సీపీ చేపట్టిన అమరణ నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్లయినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను పోరాటాల ద్వారానే సాధించుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో సీమ ప్రాంతంలోని గాలేరు నగరి, హాంద్రీనీవా వంటి ప్రాజెక్టుల పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టుల పూర్తికి దాదాపు రూ. 6వేల కోట్లు అవసరం కాగా పాత బిల్లుల కింద కేవలం రూ.3వేల కోట్లు చెల్లించడం దారుణమన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని ముఖ్య మంత్రి చంద్రబాబు కేంద్రంతో చర్చించి నిలదీయాల్సింది పోయి కనీసం అడిగిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రవిశంకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు లింగమూర్తి, నగర కార్యదర్శి మగ్బూల్ బాషా, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు.