రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు | Central Govt does not interfere on capital says GVL Narasimha Rao | Sakshi
Sakshi News home page

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు

Dec 31 2019 3:26 AM | Updated on Dec 31 2019 3:28 AM

Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం.  

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.   
 
రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా? 
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement