వరవరరావుపై కేసు ఉపసంహరించుకోవాలి | Case should be withdrawn on Varavara Rao | Sakshi
Sakshi News home page

వరవరరావుపై కేసు ఉపసంహరించుకోవాలి

Sep 20 2018 1:37 AM | Updated on Jul 29 2019 2:51 PM

Case should be withdrawn on Varavara Rao - Sakshi

హైదరాబాద్‌: విరసం నేత వరవరరావుపై కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు(వీవీ)ని కలవడానికి బుధవారం కోదండరాం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కోదండరాం వీవీ సతీమణి హేమలతతో మాట్లాడారు. వీవీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. రచయితగా, టీచర్‌గా వీవీతో తనకు అనుబంధం ఉందన్నారు.

ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, అందుకే ఆయనను పరామర్శించేందుకు వచ్చానని చెప్పారు. జైలులో ఉన్న వారిని కలవనిస్తారని, గృహనిర్బంధంలో ఉన్న వారిని కలిసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీవీ నివసించే అపార్ట్‌మెంట్‌లో ఉండే తోటివారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్‌ జర్నలిస్ట్‌ సజయ, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ తదితరులు కోదండరాంను కలవడానికి వచ్చారు.  

వీవీ ఇంటి వద్ద భారీ బందోబస్తు..  
వరవరరావు నివాసం ఉండే హిమసాయి గార్డెన్స్‌ అపార్ట్‌మెంట్‌ ప్రధాన గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ భీంరెడ్డి, ఎస్‌ఐలు సహా దాదాపు 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హేమలత కోదండరాంతో మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌లో నివసించే తోటివారికి ఇబ్బంది కలుగుతోందని ఇంత పోలీస్‌ఫోర్స్‌ ఎందుకని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదని చెప్పారు. తమ పిల్లలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు సోదాలు చేయడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement