ఎల్‌ఈడీ టీవీలు, ఫారిన్‌ లిక్కరు!

Candidates offering LED TVs and Foreign licker in the bar council elections - Sakshi

బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో అభ్యర్థుల తాయిలాలు 

ఓటర్లను ఆకర్షించేందుకు ‘భారీ’ హామీలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు.. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తగ్గకుండా ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. హామీల విషయంలో భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఎల్‌ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, ఇళ్ల స్థలాలు, కుటుంబ సభ్యులకు హెల్త్‌ కార్డులు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి 86 మంది, ఏపీ నుంచి 107 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

ఖర్చుకు తగ్గకుండా.. 
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి భారీ స్థాయిలో హామీలిస్తున్నారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పక్కన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఖరీదైన ఎల్‌ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, స్మార్ట్‌ ఫోన్లు, ఖరీదైన వాచీలు ఇస్తామంటూ ఓటర్లకు వీరు వల వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ అభ్యర్థులు మాత్రం రాజకీయ పార్టీలపై దృష్టి సారించారు. బహుమతుల కన్నా రాజకీయ పలుకుబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సామూహికం గా పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.   

ఏపీలో టీడీపీ నుంచి మద్దతు.. 
కృష్ణా–గుంటూరు జిల్లాల పరిధిలోని అభ్యర్థుల్లో ఒకరిద్దరు ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదని ప్రచారం జరుగుతోంది. అధికార టీడీపీ నుంచి వారికి మద్దతు లభిస్తోందని సమాచారం. పార్టీ తరఫున ఎమ్మెల్యే లు సైతం రంగంలోకి దిగి వారికి ఓట్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ అభ్యర్థి కర్నూలులో న్యాయవాదులకు భారీ విందు ఏర్పాటు చేశారు. దీన్ని ఉపముఖ్యమంత్రి సోదరుడు పర్యవేక్షించినట్లు స్థానిక న్యాయవాదులు చెబు తున్నారు. ఈ పార్టీ ఏర్పాటు చేసిన అభ్యర్థి రాయలసీ మ జిల్లాల్లోని కొన్ని న్యాయవాద సంఘాలకు 50 ఇం చుల ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీలను బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన కొత్త వారు, యువకులు చేస్తున్న ఖర్చును చూసి బరిలో నిలిచిన పాత వారు ఆశ్చర్యపోతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top