రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారు: బుగ్గన

Buggana Rajendranath Lashes Out at Chandrababu baseless allegations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘చంద్రబాబు నాయుడు తరచు నోరు జారుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అనేకసార్లు టెండర్లు మార్చింది టీడీపీ ప్రభుత్వమే. కమీషన్ల కోసమే ఎక్కువ అంచనాలతో చంద్రబాబు పనులు అప్పగించారు. నాడు ఎక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థలే ఇప్పుడు తక్కువకు పనులు చేస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే పనులు అప్పగించాం. రివర్స్‌ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేస్తే తప్పా చంద్రబాబు’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిథి గృహంలో  గురువారం ఆయన మీడియా సమావేశంలో  పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, ఆయన బోధలు మారలేదంటూ.. సినిమా పాటను వినిపించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

మంత్రి మాట్లాడుతూ... ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. నీరు-చెట్టు పథకం పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది. ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ నేనే కట్టానని అంటున్నారు. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి చెందిన నగరాలు. చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ సింగపూర్‌ ప్రస్తావనే. నేనే గొప్పవాడినని చెప్పుకునేది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇసుక మీద కూడా టీడీపీ నేతలు ఇప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసింది అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కాదా?.

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ఎక్కడికి వెళ్లినా బకాయిలే ఉన్నాయి. సూదికి, దూదికి బిల్లులు పెండింగే. ఆశావర్కర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంది. 2014-15 ఓన్‌ ట్యాక్స్‌ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగింది.  చంద్రబాబు  దిగిపోయే సమయంలో రూ.43 వేల పెండింగ్‌ బిల్లులు పెట్టారు. సివిల్‌ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తుంటే.. లిక్కర్‌ ధరల పెంపుపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 4380 మద్యం దుకాణాలను మూడువేలకు తగ్గించాం. పర్మిట్‌ రూమ్‌లను ఎత్తేశాం. దాదాపు 16 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.1990 ముందర ఇంగ్లీష్‌ కాలేజీలు లేవా? స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్‌ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండుతోంది. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్‌ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు లోకేష్‌, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్‌, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్‌ నేర్పించండి.

రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరేగా?. రూ.10 వేలు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు . నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారు. ఈ పనులపై విచారణ కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top