రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారు | Botsa Satyanarayana Slams BJP, TDP | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారు

Apr 22 2018 2:21 PM | Updated on Aug 24 2018 2:33 PM

Botsa Satyanarayana Slams BJP, TDP - Sakshi

విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ

సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు దీక్ష చేసింది ప్రత్యేక హోదా కోసం కాదని, తన పుట్టినరోజును అధికారికంగా జరుపుకున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాలే చూసుకుంటున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌ సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష కూడా చేపట్టారని తెలిపారు.

జపాన్‌ తరహా పోరాటాలు చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ధర్మదీక్ష అంటూ సినిమా పేర్లు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం దీక్ష చేయలేదని ప్రజలంతా గుర్తించారని చెప్పారు. బీజేపీ-టీడీపీ కలయిక వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాయని మండిపడ్డారు. రాజకీయ జిమ్మిక్కులతో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. తాజా పరిణామాలు కూడా వారి చీకటి ఒప్పందాల్లో భాగమేనని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నోట్ల మార్పిడి చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబును కన్వీనర్‌గా పెట్టారని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని గతంలోనే కోరామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement