జగదీష్ రెడ్డి, వీరేశానిది మొదటినుంచి నేరచరిత్రే: రేవంత్‌రెడ్డి

boddupalli srinivas case, revanth reddy fires on trs govt - Sakshi

సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ బతికే ఉందా అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులపై  సీఎం కేసీఆర్‌ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంతాప సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

పోలీసులు అధికార పార్టీ నేతలకు కాపలా కుక్కలా మారారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్‌పై పోరాటం చేయడమే శ్రీనివాస్ హత్యకు కారణమన్నారు. రంజిత్, సుధీర్ కాల్ డేటా బయటపెడితే ఎమ్మెల్యే వీరేశం కుట్ర బయటపడుతుందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశానిది మొదటినుంచి నేరచరిత్రే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ పార్టీ విశ్వాసం లేదన్నారు. హోంమంత్రి నాయిని రేంజ్  హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్‌కు తక్కువ అని విమర్శించారు.

సంతాపసభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మార్గం గాంధేయ మార్గమని చెప్పుకొచ్చారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసు రీ ఓపెన్ చేసి అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా నేతలను పార్టీలు మార్పించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top