మోదీకి పేదల గోడు పట్టదు

BJP works for the interest of a few rich people - Sakshi

కేవలం ధనికుల కోసమే బీజేపీ

మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ

మొరేనా / జబల్‌పూర్‌: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే పనిచేస్తోందనీ, సమాజంలో పేదల గోడు వారికి పట్టదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఆదివాసీ హక్కుల చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తామని హమీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో ‘ఆదివాసీ ఏక్తా పరిషత్‌’ అనే సంస్థ శనివారం నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు.

‘దేశంలోని ధనవంతులకు సాయం చేయాలని మీకు( ప్రధాని మోదీ) అనిపిస్తే చేయండి. కానీ సమాజంలోని పేదలు, రైతులు, ఇతర బలహీనవర్గాలనూ పట్టించుకోండి. ధనికులకు సంబంధించి రూ.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు అదే తరహా లబ్ధిని సమాజంలోని పేదలు, రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. రైతులు, భూ యజమానులు నష్టపోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతో పాటు పంచాయితీరాజ్‌ వ్యవస్థను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాహుల్‌ మండిపడ్డారు.

రాహుల్‌ రోడ్‌షో..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో రాహుల్‌ గాంధీ రోడ్‌ షో నిర్వహించారు. నర్మదా నదికి పూజలు చేసిన రాహుల్‌ అనంతరం జిల్లా కేంద్రంలోని అబ్దుల్‌ హమీద్‌ చౌక్‌ నుంచి తన యాత్రను ప్రారంభించారు. నర్మదా నది వద్ద పూజల సందర్భంగా రాహుల్‌ను ‘నర్మదా భక్తుడి’గా అభివర్ణిస్తూ వందలాది పోస్టర్లు వెలిశాయి. 8 కి.మీ పాటు సాగిన ఈ రోడ్‌షో రడ్డీ చౌక్‌లో ముగిసింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top