కర్ణాటక సంకీర్ణంలో టెన్షన్‌.. టెన్షన్‌

bjp starts on oparation kamala in karnataka after lok sabha results - Sakshi

సార్వత్రిక ఫలితాలు వెలువడగానే ‘ఆపరేషన్‌ కమల’ షురూ!

22–23 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చే వ్యూహం

శుక్రవారం నాటికి ప్రభుత్వం కూలిపోతుందన్న సదానంద గౌడ

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏడాది ముచ్చటే కానుందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్‌ కమల’ను ప్రారంభించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేసినట్లు మొత్తం 28 లోక్‌సభ సీట్లలో బీజేపీ 18 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్‌(77), జేడీఎస్‌(37) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో 111 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేడీఎస్‌–కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.

సొంత గూటిలో అసమ్మతి సెగలు
కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి పదవులు దక్కని అసమ్మతి నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  శుక్రవారం తెల్లవారేసరికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని  కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇందుకు తగ్గట్లు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. కేపీసీసీ చీఫ్‌ గుండూరావు ఫ్లాప్‌ షో అనీ, సిద్దరామయ్య ఓ మూర్ఖుడనీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ బఫూన్‌ అని ఆ పార్టీ సీనియర్‌ నేత రోషన్‌ బేగ్‌ విరుచుకుపడ్డారు. వీరివల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ భ్రష్టుపట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.సుధాకర్‌ స్పందిస్తూ ఈవీఎంలపై పార్టీ హైకమాండ్‌ పోరాటాన్నే తప్పుపట్టారు. కర్ణాటకలో సంకీర్ణ కూటమి బీటలు వారుతోందని చెప్పేందుకు ఇవన్నీ సాక్ష్యాలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రమేశ్‌ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ కమల’..
కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జర్కిహోలీ ‘ఆపరేషన్‌ కమల’లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో ఢిల్లీలో సమావేశమైన రమేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తనతో పాటు మహేశ్‌ కుమతిహళ్లి, భీమా నాయక్, జేఎన్‌ గణేశ్‌ సహా 22 మంది అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన షాకు వివరించినట్లు సమాచారం. గెలిచినఎంపీలతో మే 24న సమావేశం కావాలని యడ్యూరప్ప నిర్ణయించారు.

మా ప్రభుత్వమే కొనసాగుతుంది: సీఎం
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనల్ని సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. తన ప్రభుత్వం మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top