
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో పరివర్తన ర్యాలీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సోషల్ మీడియా సారథి, మాజీ ఎంపీ రమ్య ట్విట్టర్‌లో చేసిన విమర్శలపై బీజేపీ నేతల నుంచి అంతేస్థాయిలో దాడి ఎదురవుతోంది. మోదీ ఖాళీ కుండ పథకాన్ని ప్రకటించారని ఈ నటీమణి ఆదివారం దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా ప్రధాని మోదీ టాప్ (టమాటా, ఉల్లిగడ్డ, ఉర్లగడ్డ) ప్రణాళికను మోదీ ప్రకటించడం తెలిసిందే.
మోదీ మత్తు పదార్థాల మత్తులో ఉన్నప్పుడు ప్రకటించిన ప్రణాళిక అది, అది వాస్తవంగా పాట్ (ఖాళీ కుండ) అని రమ్య ట్విట్టర్‌లో ఆరోపణలు చేశారు. ఆ విమర్శలు ఆమె అజ్ఞానాన్ని, నోటి దురుసును చూపుతున్నాయంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో విదేశాలకు పారిపోయిన మాజీ ఎంపీ రమ్య పేరులో కూడా మందు పేరుందనే విషయాన్ని రమ్య గుర్తుంచుకోవాలంటూ బీజేపీ నాయకురాలు శిల్ప గణేశ్ ట్విట్టర్‌లో విమర్శించారు.
స్థాయి తెలుసుకో: జగ్గేశ్
రమ్యపై నటుడు జగ్గేశ్ కూడా స్పందించారు. ప్రధానమంత్రి వంటి ఉన్నతస్థాయిలోనున్న వ్యక్తులపై విమర్శలు చేసే ముందు తమ హోదా, కీర్తి, అభివృద్ధి పనులను గుర్తు చేసుకోవాలంటూ విమర్శించారు. వీరితో పాటు జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కూడా ప్రధాని మోదీని విమర్శించే స్థాయి రమ్యకు లేదని అన్నారు. ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు. రమ్య ట్విట్టర్‌లో చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమాల్లో పౌరుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమ్య గతంలో కూడా దూకుడు ప్రకటనలతో పలు వివాదాలను రేకెత్తించడం తెలిసిందే.