జమ్మూకశ్మీర్‌కు హిందూ ముఖ్యమంత్రి?

Is BJP Planning Form Goverment With A Hindu CM In Jammu Kashmir? - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా?. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ సింగ్‌ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్మల్‌ సింగ్‌ ప్రధాని మోదీతో మంతనాలు చేశారు.

నిర్మల్ సింగ్‌తో సమావేశానికి ముందు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్‌చార్జి, పార్టీ సెక్రటరీ రామ్‌ మాధవ్‌తో మోదీ ఇవాళ ఉదయం సుదీర్ఘ చర్చలు జరిపారని కూడా తెలిసింది. దీంతో పీడీపీ నుంచి వచ్చే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే ఊహాగానాలకు బలం చేకూరింది. కశ్మీర్‌లో బీజేపీ సీనియర్‌ నేత నిర్మల్‌ సింగే. ఆయన హిందూ కూడా. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర తర్వాత బీజేపీ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నాయకులు పెదవి విప్పడం లేదు.

నాయకుల వరుస పర్యటనలు
గవర్నర్‌ పాలన విధించిన తర్వాత కశ్మీర్‌కు బీజేపీ సీనియర్‌ నాయకులు కొందరు తరచుగా వెళ్లి వస్తున్నారు. పీడీపీతో విడిపోయిన పది రోజుల తర్వాత రామ్‌ మాధవ్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సజ్జద్‌లోన్‌తో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన ఆయన మోదీని కలసి మంతనాలు జరిపారు. ఈ నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోవల్‌లు సైతం శ్రీనగర్‌కు వెళ్లివచ్చారు.

పీడీపీ రెబల్స్ మద్దతు..
పీడీపీలోని రెబల్‌ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబీద్‌ అన్సారీ మెహబూబా నాయకత్వాన్ని బాహాటంగానే ప్రశ్నించారు. నాయకత్వంలో మార్పు లేకపోతే పీడీపీ రెండుగా చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలను సైతం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎందుకు కాకూడదు? అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, కశ్మీర్‌లో ప్రభుత్వ పదవి కాలం మరో రెండేళ్లు ఉన్న సంగతి తెలిసిందే.
 
బీజేపీ ముందున్న సవాలు..
జమ్మూకశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేయాలంటే 44 మంది సభ్యుల మెజార్టీ అవసరం. ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 19 మంది ఎమ్మెల్యేలు కావాలి.

పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు బీజేపీకే దక్కనున్నందున మరో 17 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. పీడీపీ తిరుగుబాటు వర్గం నుంచే మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ఒక్కటే ప్రస్తుతం బీజేపీ ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో హార్స్‌ ట్రేడింగ్‌ జరిగే అవకాశం ఉందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top