కమల్‌కు ‘గౌతమి’తో చెక్‌

BJP Plan on Kamal Haasan Check With Gouthami - Sakshi

ఇక మాటల దాడి

అధికార ప్రతినిధి పదవికి పరిశీలన

5న అభిప్రాయ సేకరణ షురూ..

సాక్షి, చెన్నై: సినీ నటి గౌతమి ద్వారా మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. తమపై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న కమల్‌ వ్యాఖ్యలపై ప్రతి దాడికి గౌతమి ద్వారా తూటాల్ని పేల్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టి, ఆమె సేవల్ని వినియోగించుకునేందుకు తగ్గ పరిశీలన జరుగుతోంది. ఇక, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక నిమిత్తం ఈనెల 5న కమలనాథుల వద్ద ఢిల్లీ పెద్ద అభిప్రాయ సేకరణ సాగనుంది.

విశ్వనటుడు కమల్, నటి గౌతమిల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిప్రాయబేధాలతో ప్రస్తుతం ఈ ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. కమల్‌ మక్కల్‌ నీది మయ్యం ఏర్పాటుతో రాజకీయ పయనంలో బిజీ అయ్యారు. ఇక, గౌతమి టీవీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటూ ముందుకు సాగుతూ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా బీజేపీపై కమల్‌ వ్యాఖ్యల తూటాల్ని , విమర్శల స్వరాన్ని పెంచి ఉండడంతో ఆయనకు సరిగ్గా సమాధానం అన్నది గౌతమి మాత్రమే ఇవ్వగలరన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చారు.

దీంతో ఆమెకు తగ్గ పదవి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఆమె సేవల్ని వినియోగించుకోవచ్చన్న సూచన రాష్ట్ర పార్టీ నుంచి బీజేపీ అధిష్టానానికి చేరింది. ఈ దృష్ట్యా, గౌతమికి అధికార ప్రతినిధి పదవి అప్పగించేందుకు తగ్గ పరిశీలన సాగుతున్నట్టు సమాచారం. చక్కటి వాక్‌ చాతుర్యం, సందర్భానుచిత వ్యాఖ్యలు చేయడంలో గౌతమి నేర్పరి కావడంతో ఆ పదవికి ఆమె అన్ని రకాల అర్హురాలే అన్న చర్చ కమలాలయంలో సాగుతోంది. ఇక, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత సమరం ముగిసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, పార్టీ అధ్యక్ష ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి పెద్దలు 5న చెన్నైకు రానున్నారు. ఇక్కడి నేతల అభిప్రాయాల్ని స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గౌతమి తన వంతు సేవలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కొందరికి మంగళవారం కానుకల్ని అందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top