మే 23 తర్వాతే ఫలితాలు ప్రకటించాలి

BJP On MPTC and ZPTC election - Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై బీజేపీ  

గవర్నర్‌కు కలిసి విన్నవించిన పార్టీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మే 23వ తేదీ తర్వాతే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిమాండ్‌ చేసింది. వీటి ఫలితాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్‌.మల్లారెడ్డి తదితరులు సోమవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియపై చర్చించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇది వరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయగా.. కేసీఆర్‌ ప్రభుత్వం వాటిని సగానికి కుదించిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసిందని మండిపడ్డారు. స్థానిక రాజకీయాలతో పైకొచ్చే బీసీలను పూర్తిగా అణచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఉందని, కానీ బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని చెప్పలేదని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న సీఎం.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఎలా కోత పెట్టారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లన్నీ తప్పుల తడకగా జరిగాయని ఆరోపించారు. తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఆదరాబాదరాగా రిజర్వేషన్లు కేటాయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 32 జిల్లా లలో 13కి పైగా జెడ్పీ చైర్మన్‌ స్థానాలు బీసీలకు రావాల్సి ఉండగా.. ప్రభుత్వం కేవలం 6 స్థానాలు మాత్రమే రిజర్వ్‌ చేసిందని చెప్పారు.   

టీఆర్‌ఎస్‌ లబ్ధి కోసమే ఎన్నికలు: దత్తాత్రేయ 
కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం జూలై 4 వరకు ఉందన్నారు. అప్పట్లోగా ఎన్నికల ఫలితాలు ప్రకటిం చుకోవచ్చని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల పలితాల్లో టీఆర్‌ఎస్‌కి చరిష్మా తగ్గుతుందని భావించిన కేసీఆర్‌ ముందుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. కేవలం పార్టీ లబ్ధి కోసమే ఆయన ముందుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top