టీడీపీపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు | bjp mlc somu veerraju comments on tdp | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 28 2018 4:27 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

bjp mlc somu veerraju comments on tdp - Sakshi

సాక్షి, విజయనగరం: టీడీపీపై మిత్రపక్షం బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మిత్రధర్మం పాటించడం లేదని, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. అది టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు చూపిస్తోందని విమర్శించారు. జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలిలో జరిగిన బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

'కురుపాం నియోజకవర్గంలో బీజేపీనే పోటీ చేస్తుంది. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం కానీ, టీడీపీ పాటించటం లేదు.  రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్న నిధులన్నీ కేంద్రానివే. రాష్ట్రంలో నిధులు సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. తాము చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు చూపించడానికి ప్రయత్నం జరుగుతోందని, ప్రజలందరూ దీనిని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని తాము ఎప్పటికీ మర్చిపోమమని అన్నారు. తనవి ఆరోపణలు కాదు, వాస్తవాలని అన్నారు.

పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి జిల్లాకూ రూ. 6 నుంచి 7 కోట్లు ఇస్తున్నామని, కానీ, ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని విమర్శించారు. సీఎం దావోస్ పర్యటనలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కారణం ప్రధాని మోదీనే అని అన్నారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు పాలించినకాలంలో కరెంట్ కొరత ఉండేదని, కానీ మోదీ వచ్చాక కరెంట్ కొరత లేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న అభివృద్ధి నిధులను టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ఎన్టీఆర్‌ జలసిరి పథకం నిజం కాదని,  బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న సోలార్ పంపు సెట్లనే ఆ పథకం కింద ఇస్తున్నారని అన్నారు. చంద్రన్న బీమా తమ ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదని, రూ. 170 కోట్లు వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, అది కేంద్రం పథకమేనని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే రాష్ట్రం ఇంకా ముందంజలో ఉంటుందని, మోదీ ఇస్తున్న ప్రతి పథకానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement