టీడీపీ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి | bjp leader suresh reddy fired on tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి

Feb 13 2018 12:41 PM | Updated on Aug 10 2018 8:46 PM

bjp leader suresh reddy fired on tdp leaders - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి

ఒంగోలు: ‘రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. దాని నుంచి తప్పించుకునేందుకే నేడు బీజేపీపైకి టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టార’ని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవిదేశాల్లో భారతదేశ ఖ్యాతిని పెంచేందుకు మోదీ కృషి చేస్తుంటే టీడీపీ మాత్రం ప్రజలకు ఆకాశంలో చందమామను చూపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న సీపీఐ రామకృష్ణ, నాటుకోడి నారాయణ తరఫున రాజీనామా చేసేందుకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే అయినా ఉన్నారా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విడగొట్టాలంటూ రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించిన సీపీఐ, తటస్థం అని చెప్పిన  సీపీఎం నాయకులు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో సీపీఐ, సీపీఎం నేతలు అలా మాట్లాడుతున్నారన్న అనుమానాలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణానికి పదేళ్లు కాలపరిమితి ఉన్నా హడావుడిగా అమరావతికి వచ్చి, కనీసం డీపీఆర్‌ కూడా తయారుచేయకుండా సింగపూర్, చైనా, మలేషియా అంటూ భారతదేశ సాంకేతికతను సైతం ఘోరంగా అవమానించారని టీడీపీపై నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ, మాదిగలకు పెద్ద మాదిగగా ఉంటానంటూ ఇచ్చిన హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు.

మత్స్యకారులు, గిరిజనుల మధ్య, బీసీలు, కాపుల మధ్య చిచ్చుపెట్టారని, జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేలను కొని, వారికి మంత్రిపదవులు కట్టబెట్టిన టీడీపీ నాయకులకు బీజేపీ విశ్వసనీయతను ప్రశ్నించే హక్కు ఎక్కడిదన్నారు. 2019 ఎన్నికల్లో మోదీయే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. కాకినాడ పోర్టుకు కేటాయించింది కేవలం 200 ఎకరాలు మాత్రమే అని, అందువల్ల దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి వంటి ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం జరగాలనే తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు శెగ్గెం శ్రీనివాసరావు, విన్నకోట సురేష్, ముదివర్తి బాబూరావు, శివాజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement